ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది.

పేజీలు

5, మే 2010, బుధవారం

3వ దినము, బాలకాండ

విశ్వామిత్రుడి వెనక రాముడు, లక్ష్మణుడు కోదండాలు పట్టుకుని వెళుతున్నారు. బ్రహ్మగారు అశ్విని దేవతలతొ వెళితె ఎలా ఉంటుందొ, స్థాణువైన శివుడి వెనకాల విశాఖుడు, స్కందుడు వెళితె ఎలా ఉంటుందొ, అలా విశ్వామిత్రుడి వెనకాల రామలక్ష్మణులు వెళుతున్నారని వాల్మీకి పోల్చారు. వాళ్ళు అలా సరయు నది దక్షిణ తీరంలొ కాలినడకన ఒకటిన్నర యోజనాలు ప్రయాణించాక చీకటి పడడం వల్ల ఒక ప్రాంతంలొ విశ్రమించారు.

అప్పుడు  విశ్వామిత్రుడు......
గృహాణ వత్స సలిలం మా భూత్ కాలస్య పర్యయః ||
మంత్ర గ్రామం గృహాణ త్వం బలాం అతిబలాం తథా ||

బ్రహ్మ దేవుని కుమార్తెలైన బల, అతిబల అనే రెండు మంత్రాలని రాముడికి ఉపదేశించాడు. ఈ రెండు విద్యల వల్ల ఆకలి వెయ్యదు, దప్పిక కలగదు, నువ్వు నిద్రపోతునప్పుడు కాని నిద్రపోనప్పుడు కాని రాక్షసులు నిన్ను ఏమి చెయ్యలేరు, దీనితో పాటు నీకు సమయస్పూర్తి, జ్ఞాపక శక్తి, బుద్ధి ప్రకాశిస్తాయి అని చెప్పి ఆ మంత్రోపదేశం చేశాడు. తరవాత రాముడు లక్ష్మణుడికి ఆ మంత్రాలని ఉపదేశించాడు. దర్భగడ్డి పరిచి ఇద్దరినీ దాని మీద పడుకోమన్నాడు. ఇద్దరు హాయిగా పడుకున్నారు.

విశ్వామిత్రుడు తెల్లవారగానే లేచి సంధ్యావందనాది కార్యక్రమాలు చేసుకొని పిల్లలిద్దరి దెగ్గరికి వచ్చి చూశాడు. వాళ్ళు నిద్రపోతున్నారు. ఆహా! ఏమి నా అదృష్టం అనుకొని......
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే |
ఉత్తిష్ఠ నర శార్దూల కర్తవ్యం దైవమాహ్నికం ||

కౌసల్య యొక్క కుమారుడైన రామ, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు కనుక నువ్వు నిద్రలేచి ప్రొద్దున్న చేసే పూర్వ సంధ్యా వందనం చెయ్యాలి. రాక్షసులను సంహరించె నువ్వు నరులలొ శార్దూలం వంటివాడివి, దైవీ సంబంధమైన ఆహ్నికములను నెరవేర్చడానికి శుభప్రదమైన సమయం మించిపోకూడదు, అందుకని రామా నిద్రలే.

రామలక్ష్మణులిద్దరూ నిద్ర లేచి చెయ్యవలసిన కార్యక్రమాలు పూర్తి చేశారు. మళ్ళి బయలుదేరి గంగ-సరయు సంగమ స్థానం దాక వెళ్లారు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూసి, అది ఎవరిదని రాముడు అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు " ఒకానొకప్పుడు పరమశివుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా మన్మధుడు బాణ ప్రయోగం చెయ్యబోతే, శివుడు తన మూడవ కంటితొ మన్మధుడిని భస్మం చేసిన ప్రదేశం ఇదే, మన్మధుడి అంగములన్ని కాలి బూడిదైన ఈ ప్రాంతాన్ని అంగదేశం అని పిలుస్తారు. ఆనాడు శంకరుడు తపస్సు చేసినప్పుడు ఆయనకి కొంతమంది శిష్యులున్నారు. శంకరుడితో ప్రత్యక్ష శిష్యరికం చేసినవాళ్ళ దెగ్గరినుంచి ఈనాటి వరకు ఉన్న వీళ్ళందరూ పాపము లేనివాళ్ళు. కాబట్టి రామ ఈ రాత్రికి వీళ్ళందరితో కలిసి పడుకొ " అని చెప్పాడు.

మరుసటి రోజున ఆ ఆశ్రమంలొ ఉన్న మహర్షులు గంగా నదిని దాటడానికి విశ్వామిత్ర రామలక్ష్మనులకి పడవ ఏర్పాటు చేశారు. ముగ్గురూ ఆ పడవలొ ప్రయాణమయ్యారు. ఆ పడవ గంగా నదిలొ వెళుతుండగా ఒక చోట గట్టిగా ధ్వని వినిపించింది. అప్పుడు రాముడు అంత గట్టిగా ధ్వని ఎందుకు వినిపిస్తుంది అని విశ్వామిత్రుడిని అడిగాడు. అప్పుడు ఆయన ఇలా చెప్పాడు '' ఒకనాడు బ్రహ్మ గారు తన మనస్సుతో కైలాస పర్వత శిఖరాల మీద ఒక సరోవరాన్ని నిర్మించారు. ఆ సరస్సుకి మానస సరోవరం అని పేరు. ఆ సరోవరం నుంచి ప్రవహించినదె సరయు నది. పవిత్రమైన ఆ సరయు నది ఈ ప్రాంతంలొ గంగా నదితో సంగమిస్తుంది, కాబట్టి ఒకసారి ఆ నదీ సంగమానికి నమస్కరించమన్నాడు". అవతలి ఒడ్డుకు చేరాక అందరూ పడవ దిగి అరణ్యంగుండా తమ ప్రయాణం కొనసాగించారు.

అలా వాళ్ళు వెళుతుంటె అక్కడున్న అరణ్యంలొ ఈల పక్షులు భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి, పులులు, సింహాలు, ఏనుగులు తిరుగుతున్నాయి. ఈ అరణ్యం ఇంత భయంకరంగా ఎందుకుందని రామలక్ష్మణులు విశ్వామిత్రుడిని అడగగా, ఆయన ఇలా చెప్పారు " పూర్వము ఇక్కడ మలదము, కరూషము
అని రెండు జనపదాలు ఉండేవి. ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ రెండు పట్టణాలు ఇవాళ అలా లేవు. దీనికంతటికి కారణం తాటక అనే ఒక స్త్రీ, ఆమె ఒక యక్ష కాంత, రాక్షసిగా మారి ఇక్కడున్న జానపదులందరినీ హింసించేది, అందుకనే ఇక్కడ ఎవరూ లేరు" అన్నాడు . అప్పుడు రాముడు, అసలు ఈ నగరాలు ఎలా ఏర్పడ్డాయి అని అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు " ఒకప్పుడు ఇంద్రుడు వృత్తాసురుడనే రాక్షసుడిని సంహరించాడు, వృత్తాసురుడు బ్రాహ్మణుడు కావడం వల్ల ఆయనని చంపినందుకు ఇంద్రుడికి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది. ఆ బ్రహ్మహత్యా పాతకం వల్ల ఇంద్రుడికి రెండు లక్షణాలు వచ్చాయి, ఆయనకి శరీరంలొ మలం పుట్టడం ప్రారంభమయ్యింది, అలాగె ఆకలి కూడా కలిగింది. అప్పుడు ఆయన ఋషులని ఆశ్రయిస్తే వాళ్ళు ఆ రెండు లక్షణాలని తొలగించారు. కాని ఆ రెండు భూమి మీద పడ్డాయి. అవి పడ్డ ప్రదేశాలని మలదము, కరూషము అనే రెండు జానపదములుగా వర్ధిల్లుతాయి, ఇక్కడున్న ప్రజలు సుఖసంతోషాలతొ ఆనందంగా ఉంటారని ఇంద్రుడు వరం ఇచ్చాడు.

అలాగే పూర్వ కాలంలొ సుకేతు అనే యక్షుడికి పిల్లలు లేకపోతె బ్రహ్మ గూర్చి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నేను నీకు కొడుకులని ఇవ్వను, ఒక కూతురుని ఇస్తాను, ఆమె కామరూపి, మహా అందగత్తె, ఆమెకి 1000 ఏనుగుల బలముంటుంది అని వరం ఇచ్చాడు. ఆమె పేరు తాటక. ఆమెకి యవ్వనం వచ్చాక సుందుడుకి ఇచ్చి వివాహం చేశారు. వాళ్ళకి మారీచుడు జన్మించాడు. 1000 ఏనుగుల బలం ఉండడం వలన, గర్వంతొ, అరణ్యంలొ ఇష్టమొచ్చినట్టు  తిరిగేవాళ్ళు. ఒకనాడు సుందుడు అగస్త్య మహర్షి మీద దాడికి దిగాడు. ఆయనకి ఆగ్రహం వచ్చి సుందుడిని సంహరించారు. ఇది గమనించిన తాటక తన కుమారుడితొ కలిసి అగస్త్య మహర్షి మీదకి వచ్చింది, అప్పుడాయన తాటకని, ' నీకు వికృతరూపంవచ్చుగాక ' అని, మారీచుడిని ' ఇవ్వాల్టినుంచి రాక్షసుడివి అవుతావని ' శపించారు. ఆ తాటక ఈ రెండు నగరాల్లో సంచరిస్తుంది, ఆమె నరమాంస భక్షనకి అలవాటుపడింది, అందుకే ఈ నగరాలలోని జనాలు ఊరు వదిలి వెళ్ళిపోయారు. కాబట్టి రామ, నువ్వు ఇప్పుడు ఆ తాటకని సంహరించాలి. నువ్వు చేసే పని దోషమే అయినా, ప్రజాకంటకులైన వాళ్ళని రాజు సంహరించి తీరాలి. పూర్వకాలంలొ మందర అనేటువంటి ఒక స్త్రీ భూమిని సంహరించడానికి ప్రయత్నిస్తే ఆమెని సంహరించారు, అలాగే భృగు మహర్షి భార్య ఇంద్రుడిని సంహరించడం కోసం తపస్సు ప్రారంభిస్తే శ్రీమహా విష్ణువు ఆమెని సంహరించారు. నువ్వు కూడా ఈ తాటకని సంహరించు " అని విశ్వామిత్రుడు అన్నాడు.

అప్పుడు రాముడు.......
పితుర్ వచన నిర్దేశాత్ పితుర్ వచన గౌరవాత్ |
వచనం కౌశికస్య ఇతి కర్తవ్యం అవిశఙ్కయా ||
గో బ్రాహ్మణ హితార్థాయ దేశస్య చ హితాయ చ |
తవ చైవ అప్రమేయస్య వచనం కర్తుం ఉద్యతః ||

"మా తండ్రిగారు మీరు ఏది చెయ్యమంటె అది చెయ్యమన్నారు, గురువుగారైన మీరు చెప్పారు కనుక లోకాన్ని రక్షించడం కోసం, బ్రాహ్మణులను, గోవులను, ఇక్కడ ఉంటున్న అన్ని ప్రాణులను కాపాడడం కోసం సుక్షత్రియుడనైన నేను తాటకని తప్పక సంహరిస్తాను" అని రాముడు అని తన ధనుస్సు తీసుకొని ధనుష్టంకారం చేశాడు, ఆ ధ్వని విన్న తాటక అది ఎటువైపు నుంచి వస్తుందొ అటు వైపు బయలుదేరింది. తాటక రామలక్ష్మణులున్న ప్రదేశానికి వచ్చింది. తాటకని చూసిన రాముడు లక్ష్మణుడితొ, ఈ తాటకని ఓ మోస్తారు వాళ్ళు చూస్తే గుండె ఆగి చనిపోతారు లక్ష్మణా " అన్నాడు.

ఆ తాటక ముందు బ్రహ్మర్షి అయిన విశ్వామిత్రుడి మీదకి దూకింది, అప్పుడాయన ఒక హుంకారం చేసేసరికి అది స్తంభించిపోయి ఉన్న చోట నిలబడిపోయింది, వెంటనే తన మాయతొ రాళ్ల వర్షం కురిపించింది, ఆ తాటక రేపిన ధూళి అందరి కళ్ళల్లో పడింది. అప్పుడు విశ్వామిత్రుడు రాముడితొ ఇంక ఉపేక్షించి లాభం లేదు, తొందరగా ఆమెని సంహరించు అన్నాడు. ఎంతైనా ఆడది కదా, ముందు దీని గమన శక్తిని కొట్టేద్దాము, అప్పుడన్నా మారుతుందేమో చూద్దాము అని రాముడు కాళ్ళు, చేతులు, లక్ష్మణుడు ముక్కు, చెవులు నరికారు. అప్పుడు ఆ తాటక మాయారూపం పొంది మాయం అయిపోయింది. అదృశ్యమైన ఆ తాటక భారి శరీరంతొ రాముడి మీద పడబోతుంటే, రాముడు ఒక బాణం ప్రయోగించి ఆ తాటకని సంహరించగా, దాని రక్తం ఏరులై ప్రవహించింది. పైనుండి దేవతలు చూసి, హమ్మయ్య! తాటక సంహరింపబడింది అని ఆనందపడ్డారు. వెంటనే ఆ దేవతలు విశ్వామిత్రుడి దెగ్గరకి వచ్చి, ఇంత ధైర్యం ఉన్న వాడి దెగ్గర అన్ని అస్త్ర-శస్త్రాలు ఉండాలి, కాబట్టి నీకు తెలిసిన ధనుర్విద్యనంతా రామలక్ష్మణులకి ఉపదేశించు అన్నారు.

అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి హయశిరోనామం అనే అస్త్రాన్ని,  క్రౌంచ అస్త్రాన్ని మంత్రోపదేశం చేశాడు. అలాగే కంకాళం, ఘోరం, కాపాలం, కంకణం అనే నాలుగు ముసలముల మంత్రోపదేశం చేశాడు. అలాగే ఐంద్రాస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరోనామకాస్త్రం, మానవాస్త్రం, వారుణాస్త్రం, ఇంద్రాస్త్రం, ఐషీకాస్త్రం, గాంధర్వాస్త్రం, నారాయణాస్త్రం, రకరకాల పిడుగులు మొదలైన సర్వాస్త్రాల మంత్రోపదేశం చేసి, రెండు అద్భుతమైన గధలని, నందనం అనే గొప్ప ఖడ్గాన్ని ఉపదేశించాడు. అప్పుడు ఈ అస్త్రాలన్నీ పురుష రూపం దాల్చి రాముడి పక్కన నిలబడి, మేము మీ కింకరులము, మమ్మల్ని ఏమి చెయ్యమంటారు అని అడిగాయి. మీరందరూ నా మనస్సులోకి వెళ్లి అక్కడ తిరుగాడుతూ ఉండండి, నేను పిలిచినప్పుడు బయటకి రండి అని ఆదేశించాడు. అవి అలాగే రాముడిలోకి ప్రవేశించాయి.

మరుసటి రోజున రాముడు విశ్వామిత్రుడితొ....... మీరు నాకు ఇన్ని అస్త్రాలని ఉపదేశించారు, అలాగే వాటి ఉపసంహారాన్ని కూడా ఉపదేశించమన్నాడు. విశ్వామిత్రుడు రాముడికి ఉపసంహార మంత్రాలని చెప్పాక ఇంకొన్ని అస్త్రాలని కూడా ఉపదేశించాడు. అలా అన్ని అస్త్రాల ఉపదేశం అయ్యాక వాళ్ళు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా వెళుతుండగా అక్కడొక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం ఎవరిదని రాముడు అడగగా, విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు " ఒకప్పుడు విరోచనుడి కుమారుడైన బలి చక్రవర్తి తన ప్రరాక్రంతొ ఇంద్రుడిని నిర్బంధించాడు. అప్పుడు శ్రీమహా విష్ణువు వామన మూర్తిగా వచ్చి బలిని పాతాళానికి పంపారు. ఆ వామన మూర్తి తపస్సు చేసిన ఆశ్రమమే ఈ ఆశ్రమం, దీనిని సిద్ధాశ్రమం అంటారు. ఇక్కడే కశ్యప ప్రజాపతి తపస్సు చేశారు, ఇక్కడే విష్ణువు ఇంద్రుడికి తమ్ముడిగా, ఉపేంద్రుడిగా పుట్టారు. నేను యాగం చేస్తున్నది కూడా ఈ ఆశ్రమంలోనే " అని చెప్పి అందరూ ఆ ఆశ్రమంలోకి వెళ్లారు.

ఆ సిద్ధాశ్రమంలొ యాగం ప్రారంభించారు, ఈ యాగం 6 రాత్రుళ్ళు 6 పగళ్ళు జెరుగుతుంది, కాబట్టి నువ్వు అన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విశ్వామిత్రుడు మౌన దీక్షలోకి వెళ్ళిపోయాడు. 5 రోజులు యాగం చక్కగా జెరిగింది, 6 వ రోజున ఆ అగ్నిహొత్రం ఒక్కసారి భగ్గున పైకిలేచింది. వెంటనే రాముడు లక్ష్మణుడిని అప్రమత్తంగా ఉండమన్నాడు. అప్పుడే పైనుండి మారీచ సుబాహువులు కొన్ని వేల రాక్షసులతో వచ్చి ఆ అగ్నిహొత్రంలోకి రక్తం పోశారు. వెంటనే రాముడు మానవాస్త్రంతొ మారీచుడిని కొట్టాడు, ఆ దెబ్బకి వాడు 100 యోజనాల దూరం వెళ్లి పడ్డాడు. సుబాహువుడిని ఆగ్నేయాస్త్రం పెట్టి కొడితె, వాడు గుండెలు బద్దలై, నెత్తురు కక్కుతూ కిందపడి మరణించాడు. మిగతా రాక్షసులందరిని వాయువ్యాస్త్రంతో నిర్జించారు. యాగం పూర్తయ్యాక విశ్వామిత్రుడు లేచి రాముడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ రాత్రి అందరూ హాయిగా పడుకున్నారు.


మిథిలా నగరంలొ జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నారు, కావున మీరు కూడా నాతో ఆ నగరానికి రండి, అక్కడ చూడవలసినవి రెండు ఉన్నాయి అని విశ్వామిత్రుడు రాముడితొ చెప్పాడు. అందరూ ఆ మిథిలా నగరానికి బయలుదేరారు.

10 కామెంట్‌లు:

  1. Great, thanks a lot.
    I used to get ramayanam from my childhood from my grand father great -Gajjelli Komuraiah.

    It's pleasure to have this on internet.

    Thanks a lot for your hard work & efforts.
    -raj

    రిప్లయితొలగించండి
  2. eppatinundo chaduvudamanukunna.ippativaraku ekkada telugulo unna pustakam dorakaledu. krutagnathalu.

    mana shastralalo unna anekaneka vishayalani kuda pondupareustarani aashistu.......

    రిప్లయితొలగించండి
  3. intha goppa ramayanm ila online lo eppatiki unde tatlu chudandi
    telugu lo ila undatam ramabhakthula adhrustam jai sriram
    K RADHAKRISHNARAO

    రిప్లయితొలగించండి
  4. Thanks
    It's pleasure to have Ramayanam on internet.

    రిప్లయితొలగించండి
  5. Its an amazing. Its our good luck to get VALMIKI RAMAYANAM in our mother tongue in net.

    Thank you.


    Kalyan.V.

    రిప్లయితొలగించండి
  6. అందరికీ రామాయణం అందించాలని ఇంత చక్కటి ఆలోచన చేసి, ఆచరించిన మీకు అందరీ తరుపున ఇవే మా హృదయపూర్వక ధన్యవాదములు..

    రిప్లయితొలగించండి
  7. vishakhudu,skandudu iddaru okare avi subrahmanyeswara swamivari perlu.dayachesi vishakhuduni vinayakudu ani marchagalaru.

    రిప్లయితొలగించండి
  8. Sri Rama Jaya Rama Jaya Jaya Rama. Jai Sri Rama Jai Sri Rama Rajjam.

    రిప్లయితొలగించండి