ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది.

పేజీలు

14, మే 2010, శుక్రవారం

38వ దినము, యుద్ధకాండ

యుద్ధం ప్రారంభమయ్యింది

వానరులందరూ ఆ యుద్ధంలో ప్రాసాదాలని తిరగ తోసేసారు, పర్వత శిఖరాలని తీసుకొచ్చి విసిరేశారు, చెట్లతో కొట్టారు. కనపడ్డ ప్రతి రాక్షసుడిని చంపేశారు. నాలుగు ద్వారాలనీ మూసి ఉంచారు. బయట ఉన్నవాళ్లు బయట ఉన్నవాళ్ళతో యుద్ధం చేస్తున్నారు.

అలా ఆ వానరములకు రాక్షసులకు యుద్ధం జెరగబోయేముందు రాముడు అన్నాడు " యుద్ధం చేస్తున్న రాక్షసులు కామరుపాన్ని పొందగలరు, అలాగే వానరములలో కూడా కొంతమంది కామరుపాన్ని పొందగలరు. ఎట్టి పరిస్థితులలోను మీరు మాత్రం కామ రూపాన్ని తీసుకోకండి. ఏడుగురము మాత్రమే నర రూపంలో ఉండి యుద్ధం చేస్తాము. విభీషణుడు, ఆయన నలుగురు మంత్రులు నర రూపంలో ఉంటారు, నేను, లక్ష్మణుడు ఉంటాము. మిగిలినవారందరూ వానర రూపంలోనే ఉండండి " అని చెప్పాడు.

ఆరోజున జెరిగిన యుద్ధంలో వానరములు విశేషమైన బలాధిక్యతను ప్రదర్శించి అద్భుతమైన యుద్ధాన్ని చేశారు. ఆ సమయంలో రాక్షసులు ముసలాలు, ముద్గరాలు, శూలాలు, త్రిశూలాలు, కత్తులు, బరిసెలు వంటి ఆయుధములను పట్టుకొచ్చి కనపడ్డ వానరాన్ని కొట్టి చంపి తినేస్తున్నారు. ఆ వానరములలో ఉన్న భల్లూకములు కనపడ్డ రాక్షసుడిని గట్టిగా కౌగలించుకుని మరీ తింటున్నాయి. ఆ యుద్ధ సమయంలో ఎక్కడ చూసినా పట్టుకో, తన్ను, గుద్దు, నరుకు అనే కేకలే వినపడుతున్నాయి. ఆ రాత్రంతా మహా భయంకరమైన యుద్ధం జెరిగింది. శిరస్సులు బంతులు ఎగిరినట్టు ఆకాశంలోకి ఎగిరాయి. ఎక్కడ చూసినా చీలిపోయిన వక్షస్థలాలు, తెగిపోయిన కాళ్ళు, చేతులు ఉన్నాయి. ఆ ప్రాంతమంతా నెత్తుటితొ బురదయ్యి యుద్ధం చేస్తుంటే కాళ్ళు జారిపోతున్నాయి. ఏనుగుల తొండాలు, కాళ్ళు, గుర్రాల కాళ్ళు మొదలైన శరీర భాగాలు ఆ యుద్ధ భూమిలో పడి ఉన్నాయి.

అటువంటి సమయంలో ఇంద్రజిత్ యుద్ధానికి వచ్చాడు. రథంలో వస్తున్న ఇంద్రజిత్ ని చూడగానే అంగదుడికి అపారమైన ఉత్సాహం వచ్చింది. అప్పుడాయన ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి ఇంద్రజిత్ రథం మీద పారేశాడు. ఆ దెబ్బకి ఇంద్రజిత్ రథం మడిసిపోయింది. ఎప్పుడైతే ఎవ్వరూ ఊహించని విధంగా అంగదుడు ఆ ఇంద్రజిత్ యొక్క రథాన్ని, గుర్రాలని, ఛత్రాన్ని విరిగిపోయేటట్టు కొట్టాడో, ఆ సంఘటనని చూసి దేవతలు, రామ లక్ష్మణులు కూడా ఆశ్చర్యపోయారు. ఇంద్రజిత్ జీవితంలో ఇప్పటిదాకా ఆయన రథాన్ని కొట్టినవాడు లేడు.

తన రథం విరిగిపోయేసరికి ఇంద్రజిత్ కి ఎక్కడలేని ఆగ్రహం వచ్చి ఆకాశంలోకి ఎగిరి అంతర్ధానం అయిపోయాడు. అప్పుడాయన మాయ చేత మంత్రములను అభిమంత్రించగానే చీకటి అలుముకుంది. తరువాత మాయ చేత సృష్టింపబడిన ఒక దివ్యమైన రథాన్ని ఎక్కి, ఆకాశంలో ఎవరికీ కనపడకుండా ఉండి, రామలక్ష్మణుల మీద బాణ పరంపర కురిపించాడు. కద్రువ యొక్క కుమారులైన సర్పాలని ఇంద్రజిత్ బాణములుగా వేశాడు. అవి బాణములుగా వచ్చి కొడతాయి, సర్పాలుగా చుట్టుకుని మర్మ స్థానములయందు కరుస్తుంటాయి. ఇంద్రజిత్ విడిచిపెట్టిన ఆ బాణములు రామలక్ష్మణులని నాగాస్త్ర బంధనంగా చుట్టేసింది. అప్పుడు రాముడు లక్ష్మణుడితో " లక్ష్మణా! మనం ఇప్పుడు ఈ ఇంద్రజిత్ ని ఏమి చెయ్యలేము. ఆబోతు వర్షాన్ని ఎలా భరిస్తుందో అలా మనం కూడా ఈ బాణాలని వహించడమే కొంతసేపు " అన్నాడు. తరువాత రాముడు మూర్చపోయి కిందపడిపోయాడు. ఓర్చుకుని నిలబడ్డ లక్ష్మణుడు రాముడి వంక చూసి ఏడుస్తూ ' ఏ మహానుభావుడిని ఎవ్వరూ యుద్ధ భూమిలో నిగ్రహించలేరో, ఎవరు విశ్వామిత్రుడి దెగ్గర ధనుర్వేదాన్ని ఉపదేశం పొందాడో, ఏ మహానుభావుడు భార్యని విడిపించుకోడానికి ఈ లంకా పట్టణానికి వచ్చాడో అటువంటి రాముడు ఇవ్వాళ నాగాస్త్ర బంధనం చేత కట్టబడి, ఉత్సాహము ఉపసమించి, భూమి మీద పడి ప్రాణములను విడిచిపెట్టాడు ' అని అనుకున్నాడు. తరువాత లక్ష్మణుడు కూడా కిందపడిపోయాడు. రాముడు పట్టుకున్న కోదండం చేతిలోనుంచి వదులయిపోయి దూరంగా పడిపోయింది. రామలక్ష్మణుల వేళ్ళ యొక్క చివరి భాగాల నుండి శరీరం అంతా అంగుళం చోటు లేకుండా ఇంద్రజిత్ బాణాలతో కొట్టి " మీ వలన నా తండ్రి ఎన్నో రాత్రులు పాన్పు మీద నిద్రపోకుండా అటు ఇటూ దొర్లాడు. ఏ రామలక్ష్మణుల వల్ల ఈ లంకా పట్టణం పీడింపబడిందో, ఏ రామలక్ష్మణుల వల్ల మా తండ్రి నిద్రపోలేదో, అటువంటి తండ్రి ఋణం తీర్చుకోడానికి ఈ రామలక్ష్మణుల ప్రాణములు పోయే వరకూ కొడతాను " అని, వారి యొక్క మర్మస్థానములలో గురి చూసి వజ్రములవంటి బాణములతో కొట్టాడు.

అప్పుడు రాముడు మెల్లగా బాహ్య స్మృతిని కూడా కోల్పోయి భూమి మీద ఒరిగిపోయాడు, లక్ష్మణుడు కూడా ఒరిగిపోయాడు. అలా రామలక్ష్మణులు పడిపోగానే చుట్టూ ఉన్న వానర నాయకులు అక్కడికి వచ్చారు. అప్పుడు ఇంద్రజిత్ హనుమని, ఋషభుడిని, వేగదర్సిని, విభీషణుడిని, సుషేనుడిని, గంధమాధనుడిని బాణాలతో కొట్టి, వానర సైన్యం అంతటినీ కలచి వేశాడు. ఆ సమయంలో వానరాలు ఎటు వెళుతున్నారో, ఎవరి మీద నుంచి దాటుతున్నారో, ఎవరిని తొక్కుతున్నారో, ఎవరిని ఈడ్చేస్తున్నారో అని చూసుకోకుండా దిక్కులు పట్టి పారిపోయారు.

రామలక్ష్మణులు ప్రాణములు విడిచిపెట్టారని సుగ్రీవుడు దుఃఖితుడై ఉన్నాడు. అప్పుడు విభీషణుడు అక్కడికి వచ్చి " నాయనా సుగ్రీవ! అన్ని వేళలా అందరికీ యుద్ధంలో జయము కలుగుతుందని అనుకోడానికి వీలులేదు, ఎంతటివారికైనా ప్రమాదం వస్తుంది. నువ్వు ఈ పరిస్థితులలో మొహాన్ని పొందకూడదు. ఈ సమయంలో నువ్వు శోకాన్ని పొందితే చెయ్యవలసిన పని స్ఫురణలోకి రాదు. అవతల వాళ్ళిద్దరూ ప్రమాదకరమైన స్థితిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరికీ కాని తెలివి వచ్చిందా మనం రక్షింపబడినట్టే, వాళ్ళిద్దరికీ కాని తెలివి రాకపోతే మనిద్దరమూ నాశనం అయినట్టే. రామలక్ష్మణుల శరీరాలలో కాంతి తగ్గలేదు, అంగుళం మేర కూడా విడిచిపెట్టకుండా బాణములతో కొట్టేసినా తట్టుకోగలిగిన బలము, వీర్యము, ప్రకాశము, శక్తి, మనోధైర్యము వాళ్ళకి ఉన్నాయి " అని చెప్పి, పారిపోతున్న వానర సైన్యాన్ని వెనక్కి తీసుకురావడానికి వెళ్ళాడు.  

కొంతసేపటికి విభీషణుడు ఆ సైన్యంతో తిరిగి వచ్చాడు. అప్పటికీ రామలక్ష్మణులు కిందపడిపోయే ఉన్నారు. పర్వతాల నుంచి సెలయేళ్ళు ప్రవహించినట్టు ఇంద్రజిత్ యొక్క బాణములు పెట్టిన ప్రతి రంధ్రం నుండి రక్తం ఏరులై ప్రవహించింది. అలా రక్తం వెళ్ళిపోతుండడం వలన వాళ్ళ శరీరాలు నీరసపడిపోతున్నాయి. అప్పటిదాకా సుగ్రీవుడికి ధైర్యం చెప్పిన విభీషణుడు ఈ పరిస్థితిని చూసి ఏడ్చి " నేను ఈ రాముడి మీద, లక్ష్మణుడి మీద ఆశ పెట్టుకున్నాను. రామలక్ష్మణులని ఆశ్రయిస్తే నాకు రాజ్యం లభిస్తుందని అనుకున్నాను. కాని ఈ రామలక్ష్మణులే యుద్ధంలో నిహతులయిపోయారు. ఇంక నాకు ఎవరు దిక్కు. మా అన్నయ్య నన్ను విడిచిపెట్టడు, నాకు లోకంలో ఎక్కడా రక్షణ దొరకదు. నేను దురదృష్టవంతుడిని " అని బాధపడ్డాడు.

విభీషణుడు అలా మాట్లాడేసరికి అప్పటివరకూ అక్కడ నిలబడ్డ వానర సైన్యం పారిపోవడం మొదలుపెట్టింది. అప్పుడు అంగదుడు అక్కడికి వచ్చి " ఇంత అసహ్యంగా, ఇంత సిగ్గులేకుండ వానర సైన్యం ఎందుకు పారిపోతుంది " అని అడిగాడు. అప్పుడు వాళ్ళన్నారు " మేము రామలక్ష్మణులు పడిపోయారని పారిపోవట్లేదు, ఎక్కడైనా ఇంద్రజిత్ వస్తాడేమో అని పారిపోతున్నాము " అన్నారు. ఇలా పారిపోవడమనేది చాలా భయంకరమైన విషయం, దయచేసి మీరందరూ వెనక్కి రండని ఆ వానర సైన్యాన్ని వెనక్కి తీసుకొచ్చారు.

ఆ సమయంలోనే ఇంద్రజిత్ లంకా నగరానికి చేరుకొని రావణుడితో " తండ్రి గారు మీరింక బెంగపడవలసిన అవసరం లేదు. నరులైన రామలక్ష్మణులని నేను సంహరించాను. నేను నిర్మించిన నాగాస్త్ర బంధనం చేత ఆ ఇద్దరూ యుద్ధ భూమిలో పడిపోయి ఉన్నారు. వాళ్ళ శరీరంలో నుంచి నెత్తురు ఏరులై పారుతోంది. వాళ్ళిద్దరూ మరణించారు, ఇక మీరు ప్రశాంతంగా ఉండండి " అన్నాడు.

ఈ మాట వినగానే రావణుడు అపారమైన సంతోషాన్ని పొంది అక్కడున్న భటులని పిలిచి " యుద్ధానికి వచ్చిన రామలక్ష్మణులు ఇద్దరూ నా కుమారుడైన ఇంద్రజిత్ చేత సంహరింపబడ్డారు, అని లంకలో చాటింపు వేయించండి. లంకంతా తోరణాలు కట్టండి, భేరీలు మ్రోగించండి. అందరూ సంతోషించేటట్టుగా పెద్ద ఉత్సవం చెయ్యండి  " అని ఆజ్ఞాపించాడు.

తరువాత అక్కడ ఉన్న రాక్షస స్త్రీలని పిలిచి " మీరు ఒకసారి అశోకవనంలో ఉన్న సీత దెగ్గరికి వెళ్ళండి. సీతని పుష్పక విమానం ఎక్కించి యుద్ధ భూమిలోకి తీసుకెళ్ళండి. ఆ యుద్ధ భూమిలో మరణించిన రామలక్ష్మణులని సీత చూస్తుంది. ' ఇంక ఎలాగూ నా భర్త మరణించాడు కదా, ఇంక రాముడి మీద ఎందుకు ఆశ ' అని లంకకి వచ్చి అలంకారం చేసుకుంటుంది, మంచి చీర కట్టుకుని సర్వాలంకారభూషితై నా పాన్పు చేరుతుంది. తొందరగా వెళ్ళి చూపించండి " అన్నాడు.

యుద్ధ భూమిలో రాక్షసులు ఉత్సాహంతో గెంతులు వేస్తూ, కేకలు వేస్తూ ఆనందంగా ఉన్నారు. వానరులందరూ చాలా నిరుత్సాహంతో, దీనంగా నిలుచుని ఉన్నారు. అప్పుడు ఆ రాక్షసులు సీతమ్మని పుష్పక విమానంలో తీసుకెళ్ళి యుద్ధ భూమిలో పడిపోయున్న రామలక్ష్మణులని చూపించారు. సీతమ్మ కిందకి చూడగా, ముళ్ళు విప్పిన ముళ్ళ పంది ఎలా ఉంటుందో, అలా బాణములు చేత కొట్టబడిన రామలక్ష్మణులు ఉన్నారు. రామలక్ష్మణులు ఇద్దరూ మరణించారు అనుకొని గుండెలు బాదుకొని ఏడ్చింది. అప్పుడు సీతమ్మ " నేను పుట్టింట్లో ఉన్నప్పుడు మహా జ్ఞానులైన జోతిష్యులు నా పాదాలు చూసి ' అమ్మ! నీ పాదాలలో పద్మాలు ఉన్నాయి. ఏ స్త్రీ అరికాళ్ళలో పద్మాలు ఉంటాయో, ఆ పద్మములు కలిగిన స్త్రీ తన భర్తతో పాటు సింహాసనం మీద కూర్చుని మహారాణిగా పట్టాభిషేకం చేసుకుంటుంది ' అన్నారు. కాని వారు చెప్పిన మాటలన్నీ అసత్యాలు అయ్యాయి. చిన్నతనంలో మా తండ్రిగారి పక్కన నేను కూర్చుని ఉంటె దైవజ్ఞులైన వారు మా ఇంటికి ఎక్కువగా వస్తుండేవారు, అప్పుడు వాళ్ళు నా సాముద్రిక లక్షణాలు చూసి ' తల మీద వెంట్రుకలు చాలా మెత్తగా, ఒత్తుగా, నల్లగా ఉన్నటువంటి స్త్రీ ఈమె, కనుబొమ్మలు కలవని స్త్రీ ఈమె, పిక్కలు గుండ్రంగా ఉండి వాటి మీద వెంట్రుకలు లేని స్త్రీ ఈమె, దంతముల మధ్యలో ఖాళీలు లేని స్త్రీ ఈమె కనుక ఈమె అయిదోతనాన్ని పూర్ణంగా పొందుతుంది, మహానుభావుడైన వాడిని భర్తగా పొందుతుంది ' అని చెప్పారు. కాని అవన్నీ అబద్ధాలు అయిపోయాయి. నా వేళ్ళ మీద ఉండే గుర్తులు, నేత్రములు, చేతులు, పాదములు, తొడలు గుండ్రంగా, సమంగా ఉండేవి, నా గోళ్ళు ఎర్రటి కాంతితో ఉండేవి, అలా ఉండడం వలన నేను పూర్ణమైన అయిదోతనాన్ని పొందుతానని మా ఇంటికొచ్చిన జ్యోతిష్యులు చెప్పేవారు.

రామ! రావణుడు నన్ను అపహరించాక దండకారణ్యం అంతా వెతికావు, హనుమని పంపించావు, నాకోసం సముద్రానికి సేతువుని కట్టి, దాటి వచ్చావు, చివరికి యుద్ధంలో ఇంద్రజిత్ మాయ వల్ల మరణించావు, ఎంత ఆశ్చర్యం రామ, నీకు బ్రహ్మాస్త్రం తెలుసు, బ్రహ్మశిరోనామకాస్త్రం తెలుసు, వారుణాస్త్రం తెలుసు, ఆగ్నేయాస్త్రం తెలుసు, ఇన్ని అస్త్రములు తెలిసిన నిన్ను ఒకడు కేవలం మాయతో కనపడకుండా కొట్టిన బాణములకు శరీరం వదిలేశావు. నువ్వు మరణించావన్న వార్త విని కౌసల్యాదులు బతుకుతార, అయోధ్య అయోధ్యలా ఉంటుందా. నువ్వు ఇన్ని కష్టాలు పడడానికి, అర్ధాంతరంగా శరీరం విడిచెయ్యడానికి నన్ను పెళ్ళి చేసుకున్నావ. నువ్వు నన్ను చేసుకోకపోతేనె బాగుండేదేమో " అని సీతమ్మ ఏడుస్తుంటే పుష్పకంలో ఉన్న త్రిజట చూడలేకపోయింది. అప్పుడు త్రిజట " ఏడవకు సీతమ్మ. రామలక్ష్మణులు మరణించలేదు, వాళ్ళిద్దరూ సజీవంగా ఉన్నారు. నేను నిన్ను ఓదార్చడానికి ఈ మాటలు చెబుతున్నానని అనుకుంటున్నావ, కాని నేను నీకు రామలక్ష్మణులు బతికున్నారని చెప్పడానికి ఒక బలవత్తరమైన కారణాన్ని చెబుతాను. భర్త మరణించిన స్త్రీ కాని ఈ పుష్పక విమానం ఎక్కితే ఇది పైకి ఎగరదు, నువ్వు పుష్పకంలోకి ఎక్కగా ఇది ఆకాశంలో నిలబడిందంటే, నువ్వు సౌభాగ్యవతిగా ఉన్నావు అని అర్ధం. యోధుడైనవాడు నిజంగా శరీరాన్ని విడిచిపెడితే సైన్యాలు ఇలా నిలబడవు, ఎవరి మానాన వాళ్ళు పారిపోతుంటారు. రామలక్ష్మణుల ముఖాల్లో కాంతి ఏ మాత్రం తగ్గలేదు. కొద్దిసేపు మూర్చపోయారు అంతే. కొద్దికాలంలో రావణుడి పది తలలు పడిపోయి ఇదే పుష్పకంలో రాముడితో కలిసి నువ్వు అయోధ్యకి వెళ్ళిపోతావు. ఏ రాక్షస స్త్రీకి నామీద లేని ప్రేమ నీ ఒక్కదానికే నా మీద ఎందుకు అంటావేమో, నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పటినుంచి నీ ప్రవర్తన చూస్తున్నాను. నీ ప్రవర్తన చేత, నీకు భర్త అంటె ఉన్న ప్రేమ చేత, నాకు నువ్వంటే విపరీతమైన ప్రేమ ఏర్పడింది. అందుకని నీకెప్పుడూ మంచి చెయ్యాలనే చూస్తుంటాను. అమ్మ! ఇంతకముందెన్నడూ నేను అబద్ధాలు చెప్పలేదు, ఇక ముందు కూడా ఎన్నడూ అబద్ధాలు చెప్పను. రామలక్ష్మణులు జీవించి ఉన్నారని నేను చెప్పినది పరమ సత్యం, నువ్వు బెంగ పెట్టుకోకు తల్లీ " అని చెప్పింది.

తరువాత ఆ పుష్పక విమానాన్ని అశోకవనానికి తీసుకెళ్ళి దింపేశారు.

ఇంతలో రాముడు మెల్లగా తేరుకుని ఎదురుగా మూర్చపోయి పడిఉన్న లక్ష్మణుడిని చూసి " ఒకవేళ లక్ష్మణుడి ప్రాణములు దక్కకపోతే, నేనొక్కడినే బతికితే, సీత నాకు దక్కినా ఆ బ్రతుకు నాకెందుకు. ఎలోకంలోనైనా వెతికితే సీతలాంటి భార్య దొరకచ్చు, కాని లక్ష్మణుడిలాంటి తమ్ముడు దొరకడు. కార్తవీర్యార్జునుడు( ఈయన ఒకసారి రావణుడిని ఓడించి చెరసాలలో బంధించాడు. ఈయనకి 1000 చేతులు ఉండేవి) ఒకేసారి 500 బాణములను ప్రయోగం చేసేవాడు, అంతకన్నా ఎక్కువ బాణములను ప్రయోగం చెయ్యగలిగే శక్తి లక్ష్మణుడికి ఉంది. నాకోసమని యుద్ధానికి వచ్చి లక్ష్మణుడు ఇలా పడిపోతే నాకు ఇంక సీత ఎందుకు. నాకు ఈ జీవితం అక్కరలేదు " అని రాముడు బాధపడ్డాడు.

అప్పుడాయన సుగ్రీవుడిని పిలిచి " సుగ్రీవ! ఇప్పటివరకూ నువ్వు నాకు చేసిన ఉపకారం చాలు, లక్ష్మణుడిని ఇలా చూస్తూ నేను బ్రతకను. నేను శరీరాన్ని వదిలేస్తాను. ఇది తెలిశాక రావణుడు నిన్ను విడిచిపెట్టడు, అందుకని నువ్వు నీ సైన్యాన్ని తీసుకొని సేతువు దాటి వెనక్కి వెళ్ళిపో. జాంబవంత, హనుమ, అంగద, మీరందరూ నాకు మహోపకారం చేశారు, మీరందరూ వెళ్ళిపొండి. నేను ఒక్క విషయానికే సిగ్గుపడుతున్నాను, విభీషణుడికి లంకా రాజ్యం ఇస్తానని ప్రతిజ్ఞ చేశాను, ఇప్పుడది అసత్య వాక్కు అయ్యింది. అసత్య వాక్యం నా నోటి నుండి దొర్లిందని నేను బాధపడుతున్నాను " అన్నాడు.

అప్పుడు సుగ్రీవుడు " విభీషణ! నువ్వు వానరాలని తీసుకొని కిష్కిందకి వెళ్ళు, నేను రావణుడిని సంహరించి సీతమ్మని తీసుకొస్తాను. సుషేణ! వీళ్ళు మూర్చపోయి ఉన్నారు, ఇంకా వీళ్ళ ప్రాణములు పోలేదు, తొందరగా వీళ్ళని కిష్కిందకి తీసుకుపో " అన్నాడు.

అప్పుడు సుషేణుడు " పూర్వకాలంలో దేవతలకి రాక్షసులకి గొప్ప యుద్ధం జెరిగింది. ఆ యుద్ధంలో రాక్షసులు దేవతలని విశేషమైన అస్త్రాలతో బాధించారు. ఎందరో దేవతలు ప్రాణాలు విడిచిపెడుతుంటే, శరీరాలు దెబ్బతింటుంటే దేవగురువైన బృహస్పతి విశల్యకరణి, సంజీవకరణి, సంధానకరణి అనే ఓషధులు కలిగిన మొక్కలని రసం పిండి వాసన చూపిస్తే ఆ దేవతలందరూ మళ్ళి జీవించారు. ప్రస్తుతం అవి పాల సముద్రంలో ఉండే రెండు పర్వత శిఖరాల మీద ఉన్నాయి. మనదెగ్గర ఉన్న వానర సైన్యంలో హనుమ, సంపాతి, ఋషభుడు, నీలుడు మొదలగు వారు మాత్రమే వెళ్ళి ఆ ఓషధులని గుర్తుపట్టగలరు. వాటిని తీసుకొచ్చి రాముడికి, లక్ష్మణుడికి వాసన చూపిస్తే వారు జీవించే అవకాం ఉంటుంది " అన్నాడు.

సుషేణుడు చెప్పిన ప్రకారం వెళదామని వారు అనుకుంటుండగా అక్కడ ఒక గొప్ప నాదం వినపడింది. ఎక్కడిదీ ఈ ధ్వని అని అందరూ ఆ సముద్రం వైపున చూడగా, బ్రహ్మాండమైన కాంతితో, రెక్కలు అల్లారుస్తూ ఒక మహా స్వరూపం వస్తుంది. అది వస్తున్నప్పుడు దాని కాంతి చేత, వేగం చేత సముద్రపు ఒడ్డున ఉన్న కొన్ని వేల వృక్షములు నేలన పడిపోయాయి. కాంతివంతమైన స్వరూపంతో గరుగ్మంతుడు వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఆయనని చూడగానే అందరూ ఆశ్చర్యపోయి నమస్కారం చేశారు. అప్పటివరకూ రామలక్ష్మణులని గట్టిగా పట్టుకుని ఉన్న నాగములు గరుగ్మంతుడు వచ్చి అక్కడ వాలగానే వాళ్ళని విడిచిపెట్టేసి పారిపోయాయి. నాగములు విడిచిపెట్టగానే రామలక్ష్మణులు స్వస్థత పొంది పైకి లేచారు. అప్పుడు గరుగ్మంతుడు వాళ్ళిద్దరిని దెగ్గరికి తీసుకొని గట్టిగా ఆలింగనం చేసుకొని వాళ్ళిద్దరి ముఖాలని తన చేతులతో తడిమాడు. గరుగ్మంతుడు అలా కౌగాలించుకోగానే, ఇంతకముందు రాముడికి ఎంత బలం ఉండేదో, ఎటువంటి పరాక్రమము ఉండేదో, ఎటువంటి బుద్ధి ఉండేదో, ఎటువంటి తేజస్సు ఉండేదో వాటికి రెండింతలు పొందాడు. వాళ్ళ ఒంటి మీద ఉన్న గాయములన్నీ మానిపోయాయి.

అప్పుడు గరుగ్మంతుడు " నాయనా రామ! ఇకమీద నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. కద్రువ యొక్క సంతానమైన భయంకరమైన కోరలున్న పాములని తన మాయ చేత ఇంద్రజిత్ బాణములుగా మార్చుకున్నాడు. ఈ నాగపాశం నుండి దేవేంద్రుడు కూడా విడిపించుకోలేడు. యక్ష, గంధర్వ, కిన్నెరులు అందరూ కలిసి ఇక్కడికి వచ్చినా ఈ నాగపాశములను విడదీయలేరు. ఇది కేవలం నన్ను చూసి మాత్రమే విడివడుతుంది " అన్నాడు.

అప్పుడు రాముడు " మీరు ఎవరు? " అని అడిగాడు.

గరుగ్మంతుడు అన్నాడు " నేను గరుగ్మంతుడిని, నేను ఎందుకు వచ్చాను అని ఇప్పుడు అడక్కు. నీకు నాకు ఒక గొప్ప స్నేహం ఉంది. నీకు నాకు ఉన్న అనుబంధమేమిటో యుద్ధం అయ్యాక చెబుతాను. ఇప్పుడు చెప్పడం కుదరదు, నువ్వు నన్ను అడగనూ కూడదు. కొద్దికాలంలోనే ఈ లంకలో వృద్ధులు, బాలురు తప్ప ఓపికున్న రాక్షసుడు ఎవ్వడూ ఉండకుండా నువ్వు కొట్టేసి సీతమ్మని పొందుతావు. మరి నేను బయలుదేరడానికి నాకు అనుమతిని కటాక్షించు రామ " అన్నాడు.

రాముడు " చాలా సంతోషం, మీరు వెళ్ళండి " అన్నాడు.

గరుగ్మంతుడు ఎలా వచ్చాడో అలా తన బంగారు రెక్కలను ఊపుకుంటూ సముద్రం మీద నుంచి వెళ్ళిపోయాడు.

రెట్టింపు ఉత్స్సహంతో, బలంతో ఉన్న రామలక్ష్మణులని చూడగానే అక్కడున్న వానరులందరూ ఆనందంతో భేరీలు మ్రోగించారు, కుప్పిగంతులు వేశారు, పాటలు పాడారు, పెద్ద పెద్ద కేకలు వేశారు. లోపల సంతోషంగా కూర్చుని ఉన్న రావణుడికి ఈ కేకలు వినపడి " ఏమి జెరిగిందో చూడండి " అన్నాడు. అప్పుడు అక్కడున్న రాక్షసులు ప్రాసాదం మీదకి ఎక్కి చూసేసరికి, రెండు ఏనుగులు స్నానం చేసి వచ్చి నిలబడితే ఎలా ఉంటుందో అలా రామ లక్ష్మణులిద్దరు నిలబడి ఉన్నారు. వాళ్ళు వెంటనే చూసిన విషయాన్ని రావణుడికి చెప్పారు. ఆ మాటలు విన్న రావణుడు మొదట ఆశ్చర్యాన్ని పొంది తరువాత ఆగ్రహంతో ఊగిపోయాడు.

అప్పుడు రావణుడు ధూమ్రాక్షుడు అనే రాక్షసుడిని పిలిచి " నువ్వు వెంటనే వెళ్ళి రాముడిని, లక్ష్మణుడిని, సుగ్రీవుడిని సంహరించి తిరిగిరా, నీకన్నా బంధువు నాకు లేడు. నువ్వు అపారమైన శౌర్యం ఉన్నవాడివి, నీకు కావలసినంత సైన్యాన్ని తీసుకుని వెళ్ళు " అన్నాడు.'

అప్పుడా ధూమ్రాక్షుడు పశ్చిమ ద్వారంగుండా బయటకి వెళ్ళాడు. ఆయన అలా బయటకి వెళ్ళగానే ఆకాశం నుండి ఒక మేఘం వచ్చి రక్తాన్ని వర్షించింది. ఆకాశంలో తిరుగుతున్న ఒక గ్రద్ద వాడి రథం మీద వాలింది. రక్తంతో తడిసిపోయిన ఒక తెల్లటి మొండెం సూర్యమండలంలో నుంచి వాడి రథం ముందు పడింది. ఇన్ని అపశకునములు కనపడినా ఆ ధూమ్రాక్షుడు యుద్ధానికి వెళ్ళాడు. 

ఆ ధూమ్రాక్షుడు తన యొక్క బాణములతో వానరులని కొట్టి వాళ్ళ శరీరాలని చీల్చేస్తున్నాడు. అప్పుడు హనుమంతుడు ఒక పెద్ద శిలని పెకలించి పరుగు పరుగున వచ్చి దానిని ధూమ్రాక్షుడి మీదకి విసిరాడు. హనుమ వేసిన శిలని గమనించిన ధూమ్రాక్షుడు ఆ రథం నుంచి బయటకి దూకేశాడు. ఆ రథం తుత్తునియలు అయిపోయింది. తరువాత ఆ ధూమ్రాక్షుడు కొన్ని బాణములతో హనుమంతుడిని కొట్టాడు. వెంటనే హనుమంతుడు ఒక పర్వత శిఖరాన్ని పీకి ఆ ధూమ్రాక్షుడి మీద వేశాడు. నజ్జునజ్జయిపోయి ఆ ధూమ్రాక్షుడు మరణించాడు.

తరువాత రావణుడు వజ్రదంష్ట్రుడు అనే రాక్షసుడిని యుద్ధానికి పంపాడు. అప్పుడాయన సైన్యంతో కలిసి దక్షిణ ద్వారంగుండా బయటకి వచ్చాడు. ఆ వజ్రదంష్ట్రుడు బయటకి రాగానే అరణ్యంలో ఉన్న నక్కలు అరిచాయి, అన్ని మృగాలు ఏడిచాయి. వజ్రదంష్ట్రుడు ఒకేసారి 7-8 బాణములని ప్రయోగించేవాడు. అన్ని వైపులకి బాణములని ప్రయోగం చేసి వానరములని కొట్టాడు. ఇక వీడిని ఉపేక్షించకూడదని అంగదుడు భావించి, ఒక పెద్ద వృక్షాన్ని పట్టుకొచ్చి వజ్రదంష్ట్రుడిని కొట్టబోయాడు. కాని ఆ వృక్షాన్ని తన బాణముల చేత వజ్రదంష్ట్రుడు నరికేశాడు. తరువాత అంగదుడు ఒక పెద్ద పర్వతాన్ని పట్టుకొచ్చి దానిని విసిరేశాడు. ఆ దెబ్బకి వజ్రదంష్ట్రుడి రథం ముక్కలయిపోయింది. మళ్ళి అంగదుడు ఒక పర్వత శిఖరాన్ని పట్టుకొచ్చి విసిరేసరికి దాని కిందపడి వజ్రదంష్ట్రుడు మరణించాడు.

ఈసారి రావణుడు అకంపనుడు అనే రాక్షసుడిని పంపాడు. ఆ అకంపనుడు యుద్ధానికి వస్తుండగా ఆయన ఎడమ కన్ను అదిరింది, అకారణంగా వాడి కంఠం బొంగురుపోయింది, పక్షులు, మృగాలు ఆయన చుట్టూ తిరుగుతూ దీనంగా ఏడుస్తున్నాయి, ఎత్తుపల్లాలు లేని మార్గంలో వెళుతున్న గుర్రాలు తొట్రుపడి మోకాళ్ళ మీద కిందపడి పైకి లేచాయి. ఈ అకంపనుడు కూడా పశ్చిమ ద్వారంగుండానే బయటకి వెళ్ళాడు. ఆయన కొంతసేపు భయంకరమైన యుద్ధం చేసి వానరాలని కొట్టాడు. తరువాత హనుమంతుడు ఆయన మీదకి ఒక పర్వతాన్ని విసరగా దానిని ముక్కలు చేశాడు. తరువాత హనుమంతుడు వేసిన ఒక పెద్ద చెట్టుని 14 బాణములతో కొట్టి బద్దలుచేశాడు. ఆ తరువాత హనుమంతుడు ఇంకొక పెద్ద చెట్టుని పట్టుకుని పరిగెత్తుకుంటూ వస్తూ దారిలో ఉన్న రాక్షసులని కొట్టుకుంటూ, ఏనుగుల్ని ఎడమ చేతితో విసిరేస్తూ మహా రౌద్రరూపంతో ఆ చెట్టును పట్టుకెళ్ళి అకంపనుడిని కొట్టాడు. ఆ దెబ్బకి వాడు పచ్చడై చనిపోయాడు.   

అప్పుడు రావణుడు తన సర్వసైన్యాధికారి అయిన ప్రహస్తుడిని పిలిచి " ప్రహస్త! యుద్ధం చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు నేను వెళ్ళాలి, కుంభకర్ణుడు వెళ్ళాలి, నికుంబుడు వెళ్ళాలి లేకపోతె తత్తుల్యమైన పరాక్రమము ఉన్న నువ్వు వెళ్ళాలి. వెళ్ళిన వాడు తిరిగి రావడం లేదు, ఇప్పుడు కాని నువ్వు వెళితే యుద్ధం చేద్దాము. మనం యుద్ధం చెయ్యలేము అని నువ్వు అంటె యుద్ధం ఆపేద్దాము " అన్నడు.

అప్పుడు ప్రహస్తుడు " మీరు ఈ మాట ఇంతకముందు ఒకసారి సభలో అడిగారు. అప్పుడు కొంతమంది ' సీతమ్మని ఇచ్చెయ్యండి ' అన్నారు. మీరు అప్పుడే ఇవ్వలేదు, ఇప్పుడు యుద్ధం ఆపడమేమిటండి. యజ్ఞంలో వేసిన దర్భలా వెళ్ళి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు నన్ను వెళ్ళమనా మీ ఉద్దేశం " అన్నాడు.

అప్పుడు రావణుడు " ప్రహస్త! నీ కంఠం గట్టిది, నువ్వు యుద్ధానికి వెళ్ళి గట్టిగా అరువు. వానరులకి యుద్ధం చెయ్యడం రాదు, వాళ్ళు చపలబుద్ధులు. నువ్వు గట్టిగా అరిస్తే అన్ని వానరాలు పారిపోతాయి. అప్పుడు యుద్ధ భూమిలో ఒక్క రామలక్ష్మణులు తప్ప ఎవరూ ఉండరు, అప్పుడు నువ్వు వాళ్ళని సునాయాసంగా కొట్టేయ్యచ్చు " అన్నాడు.

అప్పుడా ప్రహస్తుడు రావణుడికి ప్రదక్షిణ చేసి, రథానికి ప్రదక్షిణ చేసి కొన్ని లక్షల సైన్యంతో యుద్ధానికి వెళ్ళాడు. ఈయనకి కూడా అనేకమైన అపశకునాలు కనపడ్డాయి. ఈయన కూడా మిగతా వాళ్ళలాగానే వాటిని లెక్కచెయ్యకుండా తూర్పు ద్వారంగుండా ముందుకెళ్ళాడు.

అప్పుడు ప్రహస్తుడికి నీలుడికి యుద్ధం జెరిగింది. ప్రహస్తుడు చాలా గొప్ప యుద్ధం చేసి ఎందరో వానరాలని చంపాడు. ప్రహస్తుడు నీలుడి మీద బాణాలని ప్రయోగిస్తే, ఆబోతు మీద వర్షం పడితే అది ఎంత సంతోషంగా ఉంటుందో, నీలుడు కూడా ఆ బాణాలు పడుతుంటే అంత సంతోషంగా ఉన్నాడు. నీలుడు ఒక చెట్టుని పెకలించి ప్రహస్తుడి రథాన్ని కొట్టాడు, అప్పుడా రథం పడిపోయింది. తరువాత ఆయన ఒక పెద్ద సాల వృక్షంతొ ప్రహస్తుడి గుర్రాలని కొట్టాడు. ఆ తరువాత ఒక శిలని తీసుకొచ్చి ప్రహస్తుడి మీద పడేశాడు. దాంతో ఆ ప్రహస్తుడు కూడా మరణించాడు.

ప్రహస్తుడు మరణించాడన్న వార్త విన్న రావణుడు ఉద్విగ్నతని పొంది, తన సైన్యం అంతటినీ పిలిచి " ఇప్పుడు నేనే యుద్ధానికి వెళుతున్నాను. నేను బయటకి వెళ్ళాక వానరాలు లోపలికి రావచ్చు, అందుకని మీరందరూ జాగ్రత్త వహించి కోట శిఖరముల మీద నిలబడండి " అని చెప్పి రథం ఎక్కి, సైన్యాన్ని తీసుకొని యుద్దానికి వెళ్ళాడు.

రాముడంతటివాడు కూడా యుద్ధ భూమిలోకి వస్తున్న రావణుడిని చూసి ' మిట్ట మధ్యానం వేళ సూర్యుడిని చూస్తే స్పష్టంగా కనపడకుండా ఆయన తేజస్సు చేత కళ్ళు అదిరినట్టు, ఈయనని చూస్తే కూడా కళ్ళు అదురుతున్నాయి. ఎవరీ వస్తున్నవాడు ' అని ఆశ్చర్యపోయి, వస్తున్నవాడు ఎవరని విభీషణుడిని అడిగాడు.

విభీషణుడు అన్నాడు " రామ! ఆ ఏనుగు మీద వస్తున్నవాడు అకంపనుడు( ఇందాక చనిపోయినవాడు కూడా అకంపనుడే, కాని వీడు ఇంకొక అకంపనుడు), వాడిది సామాన్యమైన యుద్ధం కాదు, వాడిని కనీసం పర్వత శిఖరాలతో కొట్టాలి, లేకపోతె వాడికి ఇష్టం ఉండదు. ఆయన పక్కన రథంలో వస్తున్నవాడు ఇంద్రజిత్. వాడి రథం యజ్ఞాగ్నిలో నుంచి బయటకి వస్తుంది, సింహములు పూన్చిన రథం మీద వస్తాడు. ఈ పక్కన, మహేంద్ర పర్వతం, వింధ్య పర్వతం ఎంత శరీరాలతో ఉంటాయో, ఎంత ధైర్యంతో ఉంటాయో, అంతటి ధైర్యము, శరీరము ఉన్న అతికాయుడు వస్తున్నాడు. పర్వత శిఖరం కదిలొస్తోందా అన్నట్టుగా ఉన్న ఆ ఏనుగు మీద వస్తున్నవాడు మహోదరుడు. అక్కడ ఒక గుర్రము ఎక్కి పాశము పట్టుకొని వస్తున్నవాడు పిశాచుడు, వాడు అరవీరభయంకరుడు. అటుపక్క వృషభం ఎక్కి చేతిలో శూలం పట్టుకొని వస్తున్నవాడు త్రిశిరస్కుడు, వాడు మహా ఘోరమైన యుద్ధం చేస్తాడు. అటుపక్క తన ధ్వజానికి సర్పాన్ని గుర్తుగా పెట్టుకొని, ధనుస్సు పట్టుకొని వస్తున్నవాడు కుంభుడు. అలాగే పర్వతాలని గులకరాళ్ళగా విసరగల బాహుపరాక్రమము కలిగినవాడు ఆ పక్కన వస్తున్నాడు, వాడి పేరు నరాంతకుడు. భోజనం చెయ్యడం అందరికీ ఎంత సంతోషమో, యుద్ధం చెయ్యడం అంత సంతోషంగా ఉండేవాడు నికుంభుడు.

అదుగో అక్కడ పది తలకాయలతో, ఇరవై చేతులతో, కిరీటాలు వేసుకొని, కుండలాలు తొడుక్కొని, బ్రహ్మాండమైన పర్వతంవంటి భీమకాయం కలిగినవాడు, మహేంద్రుడు, యముడు, దేవతలు మొదలైనవారిని యుద్ధరంగంలో పరుగులు తీయించినవాడు, అందరినీ శాసించగలిగినవాడు, ఎవడి పేరు చెబితే లోకాలు ఏడుస్తాయో అటువంటి రావణుడు ఆ ఏనుగు మీద వస్తున్నాడు.

అప్పుడు రాముడు రావణుడిని చూసి " ఏమి తేజస్సు, ఏమి కాంతి, ఏమి స్వరూపం, ఏమి పరాక్రమం, మిట్ట మధ్యానం సూర్యుడిలా ప్రకాశిస్తున్నాడు. ఇప్పటివరకూ నేను దేవతలలో కాని, యక్షులలో కాని, గంధర్వులలో కాని ఇంత తేజస్సు కలిగినవాడిని చూడలేదు. కాని ఇన్నాళ్ళకి రావణుడిని చూసే అదృష్టం కలిగింది, ఇక వీడు తిరిగి ఇంటికి వెళ్ళడు. ఎవరితో యుద్ధం చెయ్యాలని చూస్తున్నానో అటువంటివాడు ఇవ్వాళ యుద్ధ భూమిలోకి వచ్చాడు " అని సంతోషంగా ధనుస్సుని చేతితో పట్టుకొని టంకారం చేశాడు.

రావణుడిని చూడగానే సుగ్రీవుడు ఒక పెద్ద పర్వత శిఖరాన్ని పెకలించి గబగబా వెళ్ళి రావణుడి మీద పడేశాడు. తన మీదకి వస్తున్న ఆ పర్వత శిఖరాన్ని రావణుడు అర్థచంద్రాకార బాణాలతో తుత్తునియలు చేసి, బంగారు కొనలు కలిగిన బాణాలతో సుగ్రీవుడి గుండెల్లో కొట్టాడు. ఆ దెబ్బకి భూమిలో నుంచి జలం పైకొచ్చినట్టు సుగ్రీవుడి గుండెల్లోనుంచి రక్తం పైకి వచ్చింది. అంతటి సుగ్రీవుడు కూడా గట్టిగా అరుస్తూ కిందపడి మూర్చపోయాడు. తదనంతరం గవాక్షుడు, గవయుడు, సుషేణుడు, ఋషభుడు, నలుడు మొదలైన వానర వీరులందరి మీద 4, 6, 8, 12 బాణములను ఏకాకాలమునందు విడిచిపెట్టి వాళ్ళ మర్మస్థానముల మీద కొట్టాడు. వాళ్ళందరూ కింద పడిపోయారు.

వానర వీరులందరినీ రావణుడు కొట్టేస్తున్నాడని హనుమంతుడు గబగబా వచ్చి రావణుడి రథం ముందు నిలబడి కుడి చెయ్యి బిగించి " రావణా! నీకు బ్రహ్మగారి వరాలు ఉన్నాయని మిడిసిపడ్డావు, సీతమ్మని అపహరించావు, నా పిడికిలి గుద్దు చేత నీలోని జీవాత్మని పైకి పంపించేస్తాను రా " అన్నాడు.

అప్పుడు రావణుడు " నువ్వంత మొనగాడివైతే అది చాలా గొప్ప విషయమే, నన్ను గుద్దు చూస్తాను " అన్నాడు.

హనుమంతుడు తన పిడికిలిని బిగించి రావణుడి శిరస్సు మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి రావణుడు స్పృహ తప్పినట్టయ్యి అటు ఇటూ తూలి " ఆహా! ఏమి గుద్దు గుద్దావురా, చేస్తే నీలాంటి వాడితో యుద్ధం చెయ్యాలి " అన్నాడు.

అప్పుడు హనుమంతుడు " ఛి దురాత్ముడా, ఇన్నాళ్ళకి నా పిడికిలి పోటు మీద నాకు అసహ్యం వేసింది. దీనితో గుద్దాక నువ్వు బతికి ఉన్నావు, ఎంత ఆశ్చర్యం. నేను ఇంక నిన్ను కొట్టను, నువ్వు నా వక్షస్థలం మీద గుద్దు, నా శక్తి ఏమిటో నువ్వు చూద్దువు కాని. అప్పుడు నేను నిన్ను మళ్ళి తిరిగి గుద్దుతాను " అన్నాడు.

అప్పుడు రావణుడు తన కుడి చేతిని బిగించి హనుమ యొక్క వక్షస్థలం మీద ఒక గుద్దు గుద్దాడు. ఆ దెబ్బకి హనుమంతుడు గిరగిరా తిరిగి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయాడు.

అప్పుడు సర్వసైన్యాధికారి అయిన నీలుడు చీమ అంత రూపాన్ని పొంది రావణుడిని బాగా విసిగించాడు. రావణుడి బాణాల మధ్య నుండి తప్పించుకుంటూ వెళ్ళి ఆయన కిరీటం మీదకి దూకి, అక్కడినుంచి కిందకి దూకి ఆయన చెవులు కొరికాడు, తరువాత ఆయన బుగ్గలు కొరికాడు, తరువాత ఆయన లాల్చిలో దూరాడు. అటు ఇటూ పాకుతూ నానా అల్లరి పెట్టాడు. అప్పుడు రావణుడు అగ్నేయాస్త్రాన్ని నీలుడి మీదకి అభిమంత్రించి వదిలాడు, అప్పుడా అస్త్రం మంటలు కక్కుతూ నీలుడి మీద పడిపోయింది. అదృష్టవశాత్తు నీలుడు అగ్ని యొక్క అంశకి జన్మించినవాడు కనుక ఆ మంటలని తట్టుకోగలిగాడు, కాని స్పృహ కోల్పోయి నెత్తురు కక్కుతూ నేల మీద పడిపోయాడు.    

ఇక రావణుడిని ఉపేక్షించకూడదని అనుకొని రాముడు ముందుకి వెళుతుండగా, లక్ష్మణుడు రాముడి పాదాలు పట్టుకొని " అన్నయ్య! నువ్వు వెళ్ళకూడదు. ఇటువంటి వాడితో యుద్ధం చెయ్యడానికి నువ్వు వెళితే మేమంతా ఎందుకు. నేను వెళతాను, నన్ను ఆశీర్వదించు " అన్నాడు.

అప్పుడు రాముడు " నాయనా! వచ్చినవాడు సామాన్యుడు కాదు. వాడు వేసిన బాణాలని నిగ్రహిస్తూ, నీ బాణములతో వాడి మర్మస్థానములయందు గురి చూసి కొడుతూ రావణుడిని నొప్పించు. లోపల మంత్రాలని మననం చేసుకుంటూ వెళ్ళు " అని చెప్పాడు.

" దుష్టాత్ముడవై మా వదినని అపహరించావు, ఇప్పుడు యుద్ధ భూమిలో కనపడ్డావు కనుక నువ్వు ఇక ఇంటికి వెళ్ళే సమస్య లేదు " అని చెప్పి లక్ష్మణుడు రావణుడి మీద బాణములను ప్రయోగించాడు. లక్ష్మణుడు వేసిన బాణములను రావణుడు దారిలోనే సంహారం చేసి తాను కొన్ని బాణములను ప్రయోగించాడు. రావణుడు వేసిన బాణములను లక్ష్మణుడు నిగ్రహించాడు. ఇక లక్ష్మణుడిని ఉపేక్షించకూడదని రావణుడు భావించి బ్రహ్మగారు ఇచ్చిన శక్తి(ఈ అస్తం ఎవరిమీదన్నా ప్రయోగిస్తే ఇంక వాళ్ళు మరణించవలసిందే) అనే భయంకరమైన ఆయుధాన్ని అభిమంత్రించి ఆయన మీద వేశాడు. లక్ష్మణుడు దాని మీదకి వేసిన అనేకమైన బాణములను కూడా అది నిగ్రహించుకుంటూ వచ్చి ఆయన వక్షస్థలం మీద పడింది. అప్పుడు లక్ష్మణుడు ' నేను విష్ణు అంశ ' అని స్మరించాడు. అయినా ఆ బాణము యొక్క దెబ్బకి లక్ష్మణుడు స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయాడు.

వెంటనే రావణుడు లక్ష్మణుడిని తన రథంలో లంకకి తీసుకు వెళదామని అనుకొని పరుగు పరుగున వచ్చి తన 20 చేతులతో లక్ష్మణుడిని ఎత్తబోయాడు. ఆ చేతులతో మేరు పర్వతాన్ని, మందర పర్వతాన్ని ఎత్తిన రావణుడు, ఆ చేతులతో హిమవత్ పర్వతాన్ని కదిపిన రావణుడు ఇవ్వాళ ఆ చేతులతో లక్ష్మణుడిని ఎత్తలేకపోయాడు( లక్ష్మణుడు పడిపోయేముందు ' నేను విష్ణు అంశని ' అని పడిపోయాడు కనుక రావణుడు ఎత్తలేకపోయాడు). ఇంతలో హనుమంతుడు మూర్చనుండి తేరుకుని చూసేసరికి, రావణుడు రథం దిగి లక్ష్మణుడిని పైకెత్తడానికి ప్రయత్నిస్తూ కనపడ్డాడు. అప్పుడు హనుమంతుడికి ఎక్కడలేని కోపం వచ్చి ' నీ దిక్కుమాలిన చేతులతో లక్ష్మణుడిని ముట్టుకుని, ఎత్తి తీసుకు పోదామనుకుంటున్నావా ' అనుకొని, పరుగు పరుగున వచ్చి తన కుడి చేతితో రావణుడి వక్షస్థలంలో ఒక పోటు పొడిచాడు. ఆ దెబ్బకి రావణుడి చెవుల నుండి, ముక్కు నుండి, కనుగుడ్ల పక్కనుండి కూడా రక్తం కారి, మోకాళ్ళ మీద కిందకి పడిపోయి, మళ్ళి స్పృహలోకి వచ్చి గబగబా తన రథంలోకి వెళ్ళి కూర్చుండిపోయాడు.

అప్పుడు లక్ష్మణుడిని హనుమంతుడు పరమభక్తితో, రక్షించుకోవాలనే భావనతో ముట్టుకునేసరికి ఆయన దూదిపింజలా పైకి లెగిసిపోయాడు. లక్ష్మణుడిని తీసుకెళ్ళి రాముడికి అప్పగించారు. వెంటనే లక్ష్మణుడు స్పృహని పొంది " బ్రహ్మగారి శక్తిని నా మీదకి ప్రయోగించాడు అన్నయ్యా, అప్పుడు నేను విష్ణు అంశని స్మరించాను. నాకు ఏ ఉపద్రవం లేదు " అన్నాడు.

లక్ష్మణుడి మాటలు విన్న రాముడు క్రోధపర్వసుడై గబగబా అడుగులు వేసుకుంటూ యుద్ధానికి బయలుదేరాడు. వెంటనే హనుమంతుడు వచ్చి " స్వామీ! ఏ విధంగా అయితే శ్రీ మహావిష్ణువు గరుగ్మంతుడి మీద కూర్చొని యుద్ధం చేస్తాడో, అలా మీరు నా వీపు మీద కూర్చొని యుద్ధం చెయ్యండి. ఆ రావణుడు రథంలో కూర్చుంటే మీరు నేల మీద నిలబడి యుద్ధం చెయ్యడమేమిటి స్వామీ, నా మీద కూర్చొని యుద్ధం చెయ్యండి " అన్నాడు.

అప్పుడు రాముడు హనుమ మీద కూర్చొని యుద్ధానికి వెళ్ళి " దురాత్ముడా, ఆచారభ్రష్టుడా, పర స్త్రీని అపహరించినవాడ! ఈ రోజు నువ్వు అంతఃపురంలోకి వెళ్ళవు. ఇవ్వాళ నీ పదితలకాయలు కొట్టేస్తాను............" అని రాముడు చెబుతుండగా, రావణుడు విశేషమైన బాణ పరంపరని హనుమంతుడి మీద కురిపించాడు. ఆ బాణపు దెబ్బలకి హనుమంతుడి శరీరం అంతా నెత్తురు వరదలై కారిపోతుంది. అలా ఉన్న హనుమని చూసిన రాముడికి పట్టరాని కోపం వచ్చి, అర్థచంద్రాకార బాణములు, నారాచ బాణములు, వంకరలు లేని బాణములు రావణుడి మీద ప్రయోగించాడు.

అవి బాణాల, మెరుపులా? అని రావణుడు ఆశ్చర్యంగా చూస్తుండగా, ఆ బాణ పరంపరకి రావణుడి గుర్రాలు పడిపోయాయి, సారధి చనిపోయాడు, ధ్వజం పడిపోయింది, చక్రాలు ఊడిపోయాయి, రావణుడు తూలి భూమి మీద నిలబడ్డాడు. ఆ రావణుడి చేతిలో కోదండము, ఖడ్గము ఉన్నాయి. అప్పుడు రాముడు రావణుడి భుజంలోకి బాణాలు కొట్టాడు, కోదండాన్ని బాణాలతో కొట్టి విరిచేశాడు, ఆ ఖడ్గాన్ని విరిచేశాడు. ఆ రావణుడి అన్ని మర్మస్థానాలని బాణాలతో కొట్టాడు. ఆ దెబ్బలకి నెత్తురు వరదలై కారిపోయింది. తరువాత రాముడు బాణములతో రావణుడి కిరీటాన్ని కొడితే అది దొర్లి కింద పడిపోయింది.
(ఈ సర్గని మకుట భంగ సర్గ అంటారు)

అప్పుడు రాముడు " భయంకరమైన యుద్ధం చేశావు రావణా. నీ ఖడ్గం విరిగిపోయింది, నీ గుర్రాలు చనిపోయాయి, నీ సారధి మరణించాడు, నీ ధ్వజం కిందపడిపోయింది, నీ రథం ముక్కలయ్యింది, నీ చేతిలో ఉన్న కోదండం విరిగిపోయింది, నీ కిరీటం కింద పడిపోయింది, నీ చేతిలో ఒక్క ఆయుధం లేదు. ఇప్పటివరకూ నా వాళ్ళని పడగొట్టి బాగా అలసిపొయావు, నీ కళ్ళల్లో భయం కనపడుతుంది, నీ ఒంటికి చెమట పట్టింది, నిన్ను విడిచిపెట్టేస్తున్నాను. పోయి ఇవ్వాళ రాత్రి పడుకో, విశ్రాంతి తీసుకో, మళ్ళి రేపు ఉత్తమమైన రథాన్ని ఎక్కు, చేతిలో ఆయుధాన్ని పట్టుకొని యుద్ధానికి రా, నా పరాక్రమము ఏమిటో చూద్దువు కాని, ఇవ్వాల్టికి పొ " అన్నాడు. 

రావణుడు వెనక్కి తిరిగి అంతఃపురానికి వెళ్ళిపోయాడు. అప్పుడాయన మంత్రులందరినీ, సైన్యాన్ని పిలిచి, సిగ్గుతో తల వంచుకొని " గరుగ్మంతుడు పాములని తినేసినట్టు, ఏనుగులు సింహము చేత ఓడింపబడినట్టు, ఇవ్వాళ నేను రాముడి బాణముల చేత ఓడింపబడ్డాను. ఇవ్వాళ ఒక నరుడు నా రాజ్యానికి వచ్చి, నన్ను కొట్టి, చంపకుండా వదిలేసి, ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకొని రేపు మళ్ళి స్వస్తతని పొంది, ఆయుధాన్ని పట్టుకొని, రథం ఎక్కి రా, చూపిస్తాను నా పరాక్రమము అన్నాడు.

ఒకనాడు బ్రహ్మగారు నాతో ' నువ్వు మనుష్యుల చేతిలో నశించిపోతావు ' అన్నారు. ఆయన మాట యదార్ధమవుతోంది. ఆ బ్రహ్మగారి గురించి తపస్సు చేసినప్పుడు దేవ, దానవ, యక్ష, గంధర్వ, కిన్నెర, కింపురుషుల చేతుల్లో మరణించకూడదని కోరుకున్నాను, కాని మనుష్యుల చేతిలో, వానరుల చేతిలో మరణించకూడదన్న వరాన్ని నేను అడగలేదు. నాకు ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది, ఇక్ష్వాకు వంశంలో అనరణ్యుడు( రావణుడు అనరణ్యుడిని యుద్ధంలో సంహరించాడు) అని ఒక రాజు ఉండేవాడు. ఆయన నన్ను ఒకనాడు ' ఒరేయ్ రాక్షసుడా, మా ఇక్ష్వాకు వంశంలో ఒకనాడు రాముడన్నవాడు జన్మిస్తాడు, ఆయన నిన్ను సంహరిస్తాడు ' అని శపించాడు. బహుశా ఆయనే ఇవ్వాళ ఇక్ష్వాకు వంశంలో రాముడిగా వచ్చి ఉంటాడు. ఒకనాడు పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న వేదవతిని అనుభవించాలని ప్రయత్నించాను. ఆ వేదవతి ' స్త్రీ కారణంగా నువ్వు నశించిపోతావు ' అని శపించింది. బహుశా ఆ వేదవాతే జనక మహారాజుకి కూతురిగా సీతగా పుట్టిందిరా, నేను సీతని నా మృత్యువు కోసమే తెచ్చిపెట్టుకున్నాను. ఒకనాడు కైలాశ పర్వతం మీద పార్వతీదేవి నన్ను శపించింది, నందీశ్వరుడు శపించాడు( నందీశ్వరుడిని చూసి రావణుడు ' కోతి ముఖంవాడ ' అని హేళన చేశాడు. ' ఆ వానరాలే నీ కొంప ముంచుతాయిరా ' అని నంది అన్నాడు). నలకూభరుడి భార్య  అయిన రంభ శాపం ఫలిస్తోంది, వరుణుడి కుమార్తె అయిన పుంజకస్థల శాపం ఫలిస్తోంది. ఇవ్వన్నీ నిజం చెయ్యడం కోసమని రాముడొచ్చాడని నేను అనుకుంటున్నాను.   

అయినా నేను దేవ దానవులని ఓడించినవాడిని, నేను ఎవరికీ భయపడను, సీతని ఇవ్వను. మీరందరూ జాగ్రత్తగ కోట బురుజులు ఎక్కండి, ప్రాసాదాలు ఎక్కండి. నేను ఎవరిని పిలిస్తే వాళ్ళు రావాలి, యుద్ధానికి వెళ్ళాలి. ఇంక మామూలు వాళ్ళు యుద్ధానికి పనికిరారు. నా తమ్ముడైన కుంభకర్ణుడు ఉన్నాడు, వాడి యుద్ధానికి ఇంద్రుడు మొదలైన వాళ్ళే హడలిపోయారు. వాడు మొన్ననే సభకి వచ్చాడు, ఇప్పుడు నిద్రపోతున్నాడు. వాడిని లేపడమే కష్టం, వాడు లెగిస్తే రాముడు ఎంత. వెంటనే వెళ్ళి కుంభకర్ణుడిని లేపి తీసుకురండి " అన్నాడు.

2 కామెంట్‌లు: