ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది.

పేజీలు

14, మే 2010, శుక్రవారం

37వ దినము, యుద్ధకాండ

విభీషణుడు, మిగతా నలుగురు రాక్షసులు ఉత్తర దిక్కున రామలక్ష్మణులు ఉన్న ప్రదేశానికి చేరి ఆకాశంలో నిలబడ్డారు. ఆకాశంలో ఉన్న విభీషణుడిని చూడగానే అక్కడున్న వానరాలు " రాక్షసుడు వచ్చాడు, కొట్టెయ్యండి " అని అక్కడున్న చెట్లని, పర్వతాలని పెకలించేశారు.



ఆ సమయంలో విభీషణుడు బెదరకుండా " నేను లంకని పాలించే రావణాసురుడి తమ్ముడిని, నన్ను విభీషణుడు అని పిలుస్తారు. మా అన్నగారు సీతమ్మని అపహరించి లంకలో పెట్టాడు. సీతమ్మని అపహరించేటప్పుడు ఆమెని రక్షించాలని ప్రయత్నించిన జటాయువుని నిగ్రహించి చంపాడు. దురాత్ముడైన రావణుడిని నేను ఎన్నో మంచి మాటలు చెప్పాను. కాని ఆయన నా మాటలు వినలేదు. ఆయనయందు అధర్మము ఉంది కనుక నేను ఆయనని విడిచిపెట్టి రాముడిని శరణు వేడడానికి వచ్చాను. రాముడు నాకే కాదు ఈ లోకములన్నిటికి శరణు ఇవ్వగలిగినవాడు. నేను మీకు శత్రువుని కాదు " అన్నాడు.

వెంటనే సుగ్రీవుడు పరుగు పరుగున రాముడి దెగ్గరికి వెళ్ళి " వచ్చినవాడు మనకి పరమ శత్రువైన రావణుడి తమ్ముడు. ఆయన ఒక రాక్షసుడు. ఈ యుద్ధ సమయంలో మనం యుద్ధాన్ని ప్రారంభించేముందు వచ్చి ఆకాశంలో నిలబడ్డాడు. ఈయనకి అభయమిచ్చి కిందకి దింపావంటె మన సైన్యంలో ఎటువంటి లోపాలున్నాయో కనిపెడతాడు. ఈయన రావణుడి గూఢచారి. ఇక్కడి రహస్యాలన్నీ కనిపెట్టి మనలో మనకి బేధాలు కలపిస్తాడు. అందుకని రామ, నువ్వు ఆయనకి శరణాగతి ఇవ్వకు. మాకు అనుమతి ఇవ్వు, వాళ్ళని సంహరిస్తాము. ఒక్కసారి గుడ్లగూబని కాని కాకులు తమ గూటిలోకి రానిస్తే, కాకి పిల్లలని ఆ గుడ్లగూబ తినేస్తుంది. ఈ విభీషణుడు కూడా అదే పని చేస్తాడు. " అన్నాడు.

అప్పుడు రాముడన్నాడు " నాయందు నీకున్న ప్రీతి ఎటువంటిదో నాకు తెలుసు సుగ్రీవ. నువ్వు మాట్లాడిన మాటల వెనుక ఉన్న ఆదుర్తాని కూడా నేను కనిపెట్టగలను. నీకున్న అనుభవం చేత చక్కని ఉదాహరణలను చెప్పి బాగా మాట్లాడావు. ఈ విషయంలో నాకు సలహా ఇవ్వాలని మీలో ఎవరన్నా అనుకుంటున్నారా " అని అడిగాడు.

అంగదుడు లేచి అన్నాడు " మనం విభీషణుడిని పరీక్ష చేసి ఆయనలో సద్గుణాలు కనపడితే స్వీకరిద్దాము. ఒకవేళ దుర్గుణాలు ఎక్కువగా కనపడితే ఆయనని విడిచిపెట్టేద్దాము " అన్నాడు.

తరువాత శరభుడు అన్నాడు " మనం కొంతమంది గూఢచారులని పంపిద్దాము. గూఢచారులు ఆయనని పరిశీలించి ఇతనికి మనం ఆశ్రయం ఇవ్వవచ్చా లేదా అన్నది నిర్ణయిస్తారు. గూఢచారులు చెప్పిన మాటలని బట్టి మనం నిర్ణయించుకుందాము " అన్నాడు.

అప్పుడు జాంబవంతుడు అన్నాడు " ఇది వేళ కాని వేళ. ఇటువంటి సమయంలో రావణుడిని విడిచిపెట్టి మన వైపుకి వచ్చాడు. ఇప్పుడు మనం ఉన్నది పరుల ప్రదేశంలో. దేశం కాని దేశంలో, కాలం కాని కాలంలో రావణుడి తమ్ముడైన విభీషణుడు శరణాగతి చేస్తున్నాడు. అందుకని ఈయనని తీసుకోకపోవడమే మంచిది " అన్నాడు.

మైందుడు అన్నాడు " మనం ఎవరన్నా పెద్దవాళ్ళని ఆ విభీషణుడి దెగ్గరికి పంపిద్దాము. అప్పుడు వాళ్ళు వేసిన ప్రశ్నలకి విభీషణుడు ఏ సమాధానాలు చెబుతాడో గమనిద్దాము, విభీషణుడు చెప్పిన సమాధానాలు మనకి అనుకూలంగా ఉంటె ఆయనని స్వీకరిద్దాము, లేకపోతె ఆయనని స్వీకరించద్దు " అన్నాడు.

రాముడు హనుమ వంక ' నువ్వేమి చెప్పవా, హనుమ! ' అన్నట్టు చూశాడు. అప్పుడు హనుమంతుడు లేచి అన్నాడు " మహానుభావ! మూడు లోకములలో జెరిగే సమస్త విషయాలని తెలుసుకోగలిగే ప్రాజ్ఞుడవి నువ్వు, నీకు వేరొకరు చెప్పవలసిన అవసరం లేదు. నేను ఈ విషయం చెప్పేటప్పుడు వాదించడానికి చెబుతున్నాననో, తర్కం చెయ్యడానికి చెబుతున్నాననో, వేరొకరు చెప్పిన అభిప్రాయాలని ఖండించి సంఘర్షణ పడాలనుకొని చెబుతున్నాననో మీరు మాత్రం భావించకూడదు. మీరు నాయందు గౌరవముంచి అడిగారు, నేను మీయందు గౌరవముంచి నాకు యుక్తము అనిపించిన మాటలు చెబుతాను. మీరు ఆలోచన చేసి నిర్ణయించుకోండి.

ఇందులో కొంతమంది విభీషణుడిని నమ్మకూడదు అన్నారు, విభీషణుడు కామరూపాన్ని పొందగలిగినవాడైతే, మన సైన్యంలోకి వచ్చి గూఢచర్యం చెయ్యవలసినవాడైతే, తన స్వరూపంతో వచ్చి ఆకాశంలో నిలబడి ' నేను రాముడిని శరణు వేడుకుంటున్నాను ' అని అతను చెప్పవలసిన అవసరం లేదు. కొంతమంది గూఢచారులని పంపమన్నారు, మనకి తెలీకుండా మనకి అపకారం చేస్తాడేమో అన్న అనుమానం ఉన్నవాడి మీదకి గూఢచారులని పంపి నిర్ణయించుకోవచ్చు. కాని ఎదురుగా నిలబడి ఉన్నవాడి మీదకి గూఢచారిని ఎలా పంపిస్తారు. కొంతమంది మంచి ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నల వల్ల సమాధానాలు రాబట్టమన్నారు, మనం అతనిని ఏమని ప్రశ్నిస్తాము? జవాబు చెప్పేవాడికన్నా ప్రశ్న వేసేవాడు తెలివి తక్కువ ప్రశ్న వెయ్యవచ్చు. ఆ తెలివి తక్కువ ప్రశ్న వల్ల మిత్రుడిగా ఉండవలసినవాడు అమిత్రత్వంతో అక్కడినుంచి వెళ్ళిపోవచ్చు, దానివల్ల మనం నష్టపోతాము. అందుకని అన్నివేళలా ప్రశ్నలు వేసి నిర్ణయించడం సాధ్యం కాదు. కొంతమంది గుణములు ఉంటె స్వీకరిద్దాము అన్నారు, వేరొకరియందు ఉండకూడని గుణము అని చెప్పబడినది మనయందు గుణము అవ్వచ్చు. కొంతమంది దేశము, కాలము యందు దోషముందని చెప్పారు, దేశము చేత, కాలము చేత ఇప్పుడే యదార్ధమైన స్థితి ఉంది.

ఇవతలవారికి అపకారము చేద్దామనే బుద్ధితో వచ్చి ఆకాశంలో నిలబడినవాడైతే ఆయన ముఖం అంత తేజోవంతంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉండదు, అంత ధైర్యంగా నిలబడలేడు. ఆయన ముఖంలో ఏ విధమైన దోషం కాని, శఠుడికి ఉండే బుద్ధికాని నాకు కనపడడంలేదు. ఆయన మాట్లాడిన మాటలలో దోషం పట్టుకోడానికి నాకు ఏమి కనపడలేదు. ఇటువంటప్పుడు మనం ఆయన యందు వేరొక భావనని ఆపాదించి శరణు ఇవ్వకుండా ఉండవలసిన అగత్యం ఉన్నది అని నేను అనుకోవడం లేదు. నేను మాత్రం నా బుద్ధి చేత ఒక నిర్ణయానికి వచ్చాను. విభీషణుడికి మీ పౌరుష పరాక్రమాల గురించి, మీ ధర్మము గురించి తెలుసు, ఆయనకి రావణుడు పౌరుషము తెలుసు, మీ పౌరుషం ముందు రావణుడి పౌరుషం నిలబడదు అని విభీషణుడు నిర్ణయానికి వచ్చాడు. అలాగే, మీరు వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసిన విషయాన్ని విభీషణుడు విన్నాడు, అధర్మాత్ముడిని సంహరించి ధర్మాత్ముడికి పట్టాభిషేకం చేస్తారు అని నమ్మి ఇక్కడికి వచ్చాడు. మీరు ఆయనకి శరణు ఇవ్వవచ్చు అని నేను అనుకుంటున్నాను " అన్నాడు.

అప్పుడు రాముడు " ఇప్పటిదాకా మీరందరూ, దోషములు ఉన్నాయా, దోషములు లేవ, తీసుకోవచ్చా, తీసుకోకూడదా అని పలు మాటలు చెప్పారు, నేను ఒక మాట చెబుతున్నాను వినండి. నా దెగ్గరికి వచ్చి భూమి మీద పడి ' రామ! నేను నీవాడనయ్యా, నువ్వు నన్ను రక్షించు ' అనినవాడియందు నేను గుణదోష విచారణ చెయ్యను.

సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే
అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ
వచ్చినవాడు విభీషణుడే కాని, రావణుడే కాని, నన్ను శరణు కోరినవాడు ఎవడైనా సరె రక్షిస్తాను. యదార్ధమునకు ఇటువంటి యుద్ధం జెరుగుతున్నప్పుడు పక్క రాజ్యం మీద ఇద్దరికి ఆశ ఉంటుంది. అదే కులంలో జన్మించినవాడు ఎవడు ఉంటాడొ వాడికి రాజ్యాధికారం మీద ఆశ ఉంటుంది, అలాగే పక్కనున్న రాజుకి ఆశ ఉంటుంది. అందుకని ఈ రెండిటి విషయంలో మనం తటస్థులము, కాని ఈ రెండు కారణములు తన వైపు ఉన్నాయి కాబట్టి విభీషణుడు వచ్చి శరణాగతి అడిగాడు.

సుగ్రీవ! ప్రపంచంలో భరతుడులాంటి సోదరుడు ఉండడు(కోరి వచ్చిన రాజ్యాన్ని వదిలాడు కనుక), నాలాంటి కొడుకు ఉండడు(తండ్రి ప్రేమని అంతలా పొందాడు కనుక) , నీలాంటి మిత్రుడు ఉండడు. అందుకని అన్నీ ఆ కోణంలొ పోల్చి చూడకు. వాడు దుష్టుడు కాని, మంచివాడు కాని, నా దెగ్గరికి వచ్చి శరణాగతి చేశాడు కనుక ఆయనకి శరణు ఇచ్చేస్తాను. ఈ బ్రహ్మాండములో ఉన్న పిశాచములు, దానవులు, యక్షులు, ఈ సమస్త పృధ్విలో ఉన్న భూతములు కలిసి నా మీదకి యుద్ధానికి వస్తే, నేను నా చిటికిన వేలి గోటితో చంపేస్తాను.

పూర్వకాలంలో ఒక చెట్టు మీద రెండు పావురాలు ఉండేవి. అవి ఒక ఆడ పావురము, ఒక మగ పావురము. ఒకనాటి సాయంకాలం ఒక బోయవాడు అటుగా వెళ్ళిపోతూ ఆనందంతో రమిస్తున్న రెండు పావురములను చూశాడు. అప్పుడాయన బాణం పెట్టి ఆడ పావురాన్ని కొట్టాడు. బాణం దెబ్బకి కిందపడిన ఆడ పావురాన్ని అక్కడే కాల్చుకొని తిని వెళ్ళిపోయాడు. ఆడ పావురం చనిపోయిందని ఆ మగ పావురం చాలా బాధ పడింది. కొంతకాలానికి ఆ బోయవాడు విశేషమైన వర్షం పడుతుండగా వేటకని వచ్చి, ఏమి కనపడకపోయేసరికి ఒక చెట్టుకింద ఉండిపోయాడు. తరువాత ఆ అరణ్యంలో నడుస్తూ నీరసం చేత కళ్ళు తిరిగి, పూర్వం తాను ఏ ఆడ పావురాన్ని చంపి తిన్నాడో ఆ చెట్టు కింద పడిపోయాడు. అప్పుడా మగ పావురం ఆ బోయవాడిని చూసి గబగబా వెళ్ళి నాలుగు ఎండు పుల్లలని తీసుకొచ్చి, ఎక్కడినుంచో అగ్నిని తీసుకువచ్చి నిప్పు పెట్టింది. అప్పుడా వేడికి ఈ బోయవాడు పైకి లేచి స్వస్తతని పొందాడు. ఆకలితో ఉన్న ఆ బోయవాడి ఆకలి తీర్చడం కోసం ఆ మగ పావురం అగ్నిలో పడిపోయి ప్రాణం వదిలేసింది. తన భార్యని చంపిన బోయవాడు తన చెట్టు దెగ్గరికి వచ్చి పడిపోతె, ఒక మగ పావురం ఆతిధ్యం ఇచ్చి, తన చెట్టు కింద పడిపోవడమే శరణాగతి అని భావించి తన ప్రాణములు ఇచ్చి ఆ బోయవాడిని రక్షించింది. నేను మనుష్యుడిలా పుట్టి, క్షత్రియ వంశ సంజాతుడనై, దశరథుడి కొడుకునై, నన్ను శరణాగతి చేసినవాడి గుణదోషములను ఎంచి, నీకు శరణాగతి ఇవ్వను అంటె నేను రాజుని అవుతాన? క్షత్రియుడని అవుతాన? ఈ భూలోకంలొ ఉన్న సమస్త భూతములలో ఏదన్నా సరె నన్ను శరణాగతి చేస్తే, వాళ్ళ యోగక్షేమాలు నేను వహిస్తాను. శరణాగతి చేసినవాడు బలహీనుడై, శరణు ఇవ్వవలసినవాడు బలవంతుడై ఉండి కూడా శరణు ఇవ్వకపోతె, వాడు చూస్తుండగా శరణాగతి చేసినవాడు మరణిస్తే, మరణించినవాడు రక్షించనివాడి యొక్క పుణ్యాన్ని అంతా తీసుకొని ఊర్ధలోకాలకి వెళ్ళిపోతాడు. రక్షించనివాడి కీర్తి ప్రతిష్టతలు నశించిపోతాయి. అందుచేత నేను విభీషణుడికి శరణు ఇస్తున్నాను, ఆయనని తీసుకురండి " అన్నాడు.

అప్పుడు సుగ్రీవుడు అన్నాడు " రామ! నీకు తప్ప ఇలా మాట్లాడడం ఎవరికి చేతనవుతుంది. నీ ప్రాజ్ఞతకి మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను " అన్నాడు.

రాముడి మాటలకు సంతోషించిన విభీషణుడు ఆయన దెగ్గరికి వచ్చాడు. ఆయన భూమి మీదకి దిగుతూనే ' ఇది రాముడు నిలబడిన భూమి ' అని, ఆ భూమికి నమస్కరించి అన్నాడు " రామచంద్ర! నేను రావణుడి తమ్ముడిని, నన్ను విభీషణుడు అంటారు. నేను లంకా పట్టణాన్ని విడిచిపెట్టి నీ దెగ్గరికి వచ్చేశాను. నా ఐశ్వర్యాన్ని, భార్యని, బిడ్డలని వదిలేసి నువ్వే నా సర్వస్వం అని నమ్మి వచ్చేశాను. నా శిరస్సుని నీ పాదాలకి తగల్చి శరణాగతి చేస్తున్నాను. నా యోగక్షేమములను నువ్వే వహించాలి " అన్నాడు.

రాముడు విభీషణుడిని తన పక్కన కూర్చోపెట్టుకొని లంకలో ఉన్న రాక్షసుల బలాబలాల గురించి అడిగాడు. అప్పుడు విభీషణుడు రావణుడి గురించి, కుంభకర్ణుడి గురించి, ఇంద్రజిత్ గురించి మరియు ఆ లంక ఎంత శత్రు దుర్భేద్యమో కూడా చెప్పాడు. అప్పుడు రాముడన్నాడు " విభీషణ బెంగపెట్టుకోకు, రావణుడిని బంధువులతో, సైన్యంతో సహా సంహరిస్తాను. నీకు లంకని దానం చేస్తాను. నిన్ను లంకకి రాజుగా పట్టాభిషేకం చేస్తాను. రావణుడు హతమయ్యేవరకు నువ్వు ఆగక్కరలేదు, ఇప్పుడే నిన్ను లంకకి రాజుగా చేసేస్తాను " అన్నాడు.

అప్పుడు విభీషణుడు " మీకు శరణాగతి చేశాను కనుక మీరు ఏమాట చెబితే ఆ మాట వింటాను. రావణుడి మీద యుద్ధం చెయ్యమంటె యుద్ధం చేస్తాను. మీకు ఎప్పుడన్నా సలహా కావలసి వచ్చి నన్ను అడిగితే నేను చెప్పగలిగిన సలహా చెబుతాను " అన్నాడు.

మళ్ళి రాముడు అన్నాడు " లక్ష్మణా! వెంటనే వెళ్ళి సముద్ర జలాలని తీసుకురా. ఈయనకి అభిషేకం చేసి లంకా రాజ్యానికి రాజుగా ప్రకటిస్తాను " అని విభీషణుడికి పట్టాభిషేకం చేశాడు.

ఆ తరువాత రావణుడు శార్దూలుడనే గూఢచారిని రాముడి దెగ్గరికి పంపించాడు. ఆ శార్దూలుడు అక్కడ ఉన్న వానర బలాన్ని అంతటినీ చూసి రావణుడి దెగ్గరికి వెళ్ళి " అది వానర సైన్యమా? సముద్రం పక్కన నిలబడ్డ మరో సముద్రంలా ఉందయ్యా. నువ్వు ఆ వానర బలాన్ని గెలవలేవు, అక్కడున్న వీరులు సామాన్యులు కారు, నా మాట విని సీతమ్మని రాముడికి అప్పగించు " అన్నాడు.

" నేను మాత్రం సీతని ఇవ్వను " అని, సుకుడు అనేవాడిని పిలిచి " నువ్వు పక్షి రూపంలో సుగ్రీవుడి దెగ్గరికి వెళ్ళి నేను చెప్పానని ఒక మాట చెప్పు. ' నువ్వు వానరుడివి, నేను రాక్షసుడిని. నేను అపహరించింది నరకాంతని, మధ్యలో నీకు నాకు కలహం ఎందుకు? మీరు ఈ సముద్రాన్ని దాటి రాలేరు. ఒకవేళ దాటాలని ప్రయత్నించినా నా చేతిలో మీరు చనిపోతారు. ఒక మానవకాంత కోసం వానరులు ఎందుకు మరణించడం? నా మాట విని మీరు వెళ్ళిపొండి ' అని సోదరుడైన సుగ్రీవుడితో చెప్పి, నేను ఆయన కుశలమడిగానని చెప్పు " అని సుకుడిని పంపించాడు.

ఆ సుకుడు పక్షి వేషంలో వచ్చి ఆకాశంలో నిలబడి, సుగ్రీవుడిని ఉద్దేశించి రావణుడు చెప్పిన మాటలని చెప్పాడు. ఇదంతా విన్న సుగ్రీవుడు అన్నాడు " దుర్మార్గుడు, దురాత్ముడు అయిన రావణుడు నిజంగా అంత శక్తి కలిగినవాడైతే, రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని ఎందుకు అపహరించాడు. రాముడి కోదండ విద్యా పాండిత్యము ముందు రావణుడు నిలబడలేడు. వాడి స్నేహము, వాడి సందేశము నాకు అక్కరలేదు " అన్నాడు.

ఈలోగా అక్కడున్న వానరాలు గూఢచారిని విడిచిపెట్టకూడదని చెప్పి, అందరూ పైకి ఎగిరి ఆయన రెక్కలు విరిచేస్తున్నారు. అప్పుడా సుకుడు ' రామ రామ ' అని ఏడిస్తే, రాముడు వెంటనే ఆ వానరాలని శాంతింప చేసి సుకుడుని విడిపించాడు. కాని వానరములు సుకుడిని బందీగా పట్టుకుని ఉంచాయి.

ఏమిచేస్తే ఈ సముద్రం మనకి దారి ఇస్తుంది అని విభీషణుడిని అడుగగా, ఆయన అన్నాడు " రాముడు శరణాగతి చేస్తే సముద్రం దారి ఇస్తుంది " అన్నాడు.

చందనము మొదలైన వాటి చేత ఒకనాడు అలదబడినటువంటి బాహువు, కోట్ల గోవులని దానము చేసిన బాహువు, మణులతో కూడిన కేయూరములు మొదలైనవాటితో  అలంకరింపబడ్డ బాహువు, అనేకమంది స్త్రీలచేత స్ప్రుసింపబడ్డ బాహువు, ఒకనాడు సీతమ్మ తలగడగా వాడుకున్న బాహువుని ఈనాడు తనకి తలగడగా చేసుకొని రాముడు సముద్రానికి శరణాగతి చేసి సముద్రపు ఒడ్డున పడుకున్నాడు. మూడు రాత్రులు గడిచిపోయినప్పటికి సముద్రుడు రాకపోవడం వల్ల రాముడికి ఆగ్రహం వచ్చి లక్ష్మణుడితో అన్నాడు " పౌరుషం ఉన్నవాడు తన పౌరుషాన్ని ప్రకటించకుండా మంచితనాన్ని ప్రకటిస్తే చేతకానివాడిగా చూస్తుంది ఈ ప్రపంచం. ఈ సాగరం దారి ఇవ్వకపోతె నేను వెళ్ళలేను అనుకుంటుంది. బ్రహ్మాస్త్రం చేత ఈ సాగరాన్ని ఎండించేస్తాను. ఇందులో ఉన్న తిమింగలాలని, మొసళ్ళని, పాములని, రాక్షసులని నిగ్రహిస్తాను. ఒక్క ప్రాణి బతకకుండా చేసేస్తాను. ఈ బ్రహ్మాస్త్రం విడిచిపెట్టిన తరువాత ఇక్కడ నీరు ఉత్తర క్షణం ఆవిరయిపోయి ధూళి ఎగురుతుంది. అప్పుడు వానరులందరూ భూమి మీద నడుచుకుంటూ లంకని చేరుకుంటారు " అని చెప్పి, కోదండాన్ని తీసి బ్రహ్మాస్త్రాన్ని అనుసంధానం చేశాడు.

అలా చేసేటప్పటికి పర్వతాలన్ని కదిలిపోయాయి, వ్యాకులంగా గాలి వీచింది, అగ్నిహోత్రపు మంటలు సూర్యుడి నుండి కిందపడ్డాయి, ప్రాణులన్నీ దీనంగా ఘోష పెట్టాయి, 2 యోజనముల దూరం సముద్రము వెనక్కి వెళ్ళిపోయింది. ఆ సమయంలో సముద్రుడు లోపలినుంచి బయటకి వచ్చాడు.

ఆ సముద్రంలో పుట్టిన అనేకమైన బంగారములు, రత్నములతో కూడిన ఒక పెద్ద హారాన్ని సముద్రుడు వేసుకొని ఉన్నాడు. శ్రీ మహావిష్ణువు ధరించే కౌస్తుభానికి తోడపుట్టిన ఒక మణిని మెడలో వేసుకొని ఉన్నాడు. పైకి కిందకి వెళుతున్న తరంగ సద్రుస్యమైన వస్త్రాన్ని ధరించి ఉన్నాడు. గంగ, సిందు మొదలైన నదులన్నీ స్త్రీల స్వరూపాన్ని పొంది ఆయన వెనుక వస్తున్నాయి. అలా పైకిలేచిన సముద్రుడు రాముడికి నమస్కరించి " భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశములు అనే పంచ భూతములు ఉన్నాయి. వీటన్నిటికి ఒక స్వభావం ఉంటుంది, ఆ స్వభావాన్ని ఈ పంచ భూతములు అతిక్రమించలేవు. సముద్రం అంటె అగాధంగా ఉండాలి, లోతుగా ఉండాలి, అందులోకి దిగినవాడికి ఆధారం చిక్కకూడదు, సముద్రంలో ఏదన్నా పడితే మునిగిపోవాలి, వ్యాకులితమైన తరంగాలతో ఒడ్డుని కొడుతూ ఉండాలి. ఇలా ఉండకపోతే దానిని సముద్రము అనరు. అందుకని ఈ సముద్రాన్ని ఎండింపచెయ్యడం, సముద్రంలో నుంచి దారి ఇవ్వడం నాకు వీలుపడే విషయం కాదు. నువ్వు అభిమంత్రించిన బ్రహ్మాస్త్రాన్ని నా మీదకి వెయ్యకు. నీ దెగ్గర ఉన్న వానరములలో విశ్వకర్మ కుమారుడైన నలుడు ఉన్నాడు. విశ్వకర్మ గొప్ప గొప్ప కట్టడములను నిర్మిస్తూ ఉంటాడు, అటువంటివాడి తేజస్సు కనుక ఈ నలుడికి సేతువు నిర్మాణం తెలుసు. మీరు నా మీద సేతువుని నిర్మించుకోండి. అందుకని వానరులు తెచ్చి పడేసిన చెట్లు, బండలు మొదలైనవి అటూ ఇటూ చిమ్మకుండా నా తరంగముల చేత తేలేటట్టు చేస్తాను. నాలొ ఉన్న ఏ క్రూర మృగము వల్ల వారధిని దాటేటప్పుడు వానరములకి ఎటువంటి భీతి లేకుండా నేను కాపాడతాను. సేతు నిర్మాణం వెంటనే ప్రారంభించండి. ద్రుమకుల్యము అని ఉత్తర తీరంలో ఉంది. అక్కడుండే జలాలని ఆభీరులు, దాస్యులు అనే వారు తాగేస్తుంటారు. సముద్రాన్ని క్షోభింప చేస్తుంటారు. అందుకని నువ్వు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఇక్కడి నుంచి అక్కడికి ప్రయోగించు " అన్నాడు.

అపడు రాముడు బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించగా అది ఉత్తర దిక్కుకి వెళ్ళి ఆభీరులు, దాస్యులు మీద పడింది. ఆ దెబ్బకి అక్కడున్నవారందరూ మరణించారు. ఈ బాణం భూమిలోకి   వెళ్ళి భూమిని పెకలించగా అందులో నుంచి గంగ పుట్టింది. " అక్కడ మందాకినీ జలాలలాంటి తియ్యటి జలాలు ప్రవహిస్తాయి, అక్కడ గో సంపద పెరుగుతుంది, రోగాలు ఉండవు, మనుష్యులు ప్రశాంతంగా ఉంటారు, అక్కడ విశేషంగా తేనె, చెట్లు, పళ్ళు, పెరుగు, నెయ్యి మొదలైనవి లభిస్తాయి. ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది " అని రాముడు బ్రహ్మాస్త్రం గుచ్చుకున్న ప్రాంతానికి వరం ఇచ్చాడు.

వెంటనే నలుడు పరిగెత్తుకొచ్చి సేతు నిర్మాణం ప్రరంభిస్తానన్నాడు. అప్పుడు అక్కడున్న వానరులందరూ సంతోషపడిపోయి పర్వతాలు, కొండలు ఎక్కి పెద్ద పెద్ద శిలలు మోసుకొచ్చి సముద్రంలో పడేస్తున్నారు. ఆ సమయంలో ఎవరినోట విన్నా ' సీతారామ ప్రభువుకి జై ' అంటూ, ఉత్సాహంగా రకరకాల చెట్లని తీసుకొచ్చి సముద్రంలో పడేశారు. మొదటి రోజున 14 యోజనముల సేతువుని నిర్మించారు, రెండు మూడు నాలుగు అయిదు రోజులలో 20, 21, 22, 23 యోజనాల సేతువుని నిర్మించేసారు. మొత్తం అయిదు రోజులలో 100 యోజనముల సేతువు నిర్మాణం అయిపోయింది.



" మీరందరూ ఈ సేతువు మీద ప్రయాణం చేసి ఆవలికి చెరుకోండి " అని రాముడు అన్నాడు.



అప్పుడా వానరములలో కొంతమంది సేతువు మీద నడవకుండా సేతువు యొక్క అంచుల మీద నడిచేవారు. కొంతమంది సముద్రంలోకి దూకి మళ్ళి సేతువు ఎక్కి వెళ్ళేవారు. ఇంకొంతమంది సముద్రంలో ఈదుకుంటూ వచ్చారు. కొంతమంది ఒక పెద్ద చెట్టుని పెకలించి సముద్రంలో పడేసి, దాని మీద కూర్చుని తోసుకుంటూ వచ్చేవారు. ఆ రోజున సముద్ర ఘోష గొప్పదా వానర ఘోష గొప్పదా అంటె, ఎవరూ చెప్పలేకపోయారు, అంతగా అల్లరి చేసుకుంటూ వెళ్ళారు. ఎన్నిరోజులైనా ఆ సైన్యం లంకా పట్టణానికి వస్తూనే ఉంది. చివరికి అన్ని కోట్ల వానర సైన్యం లంకని చేరుకుంది.

అప్పుడు రాముడు సుగ్రీవుడిని, విభీషణుడిని పిలిచి " మనం అవతల ఒడ్డున ఉండగా సుకుడన్నవాడు రాయబారం చెయ్యడానికి వచ్చాడు కదా, వాడు ఎక్కడున్నాడు " అని అడిగాడు.

అప్పుడు ఆ సుకుడిని తీసుకొచ్చి రాముడి ముందు ప్రవేశపెట్టారు. అప్పుడు రాముడు " నువ్వు ఎందుకొచ్చావు" అని అడిగాడు.

సుకుడన్నాడు " బుద్ధిహీనుడైన రావణుడు మీ బలాన్ని చూసి రాయబారం చెప్పమన్నాడు, ఇందులో నా తప్పు లేదు. నీ వంటి ప్రాజ్ఞుడు రాయబారిని చంపడు " అన్నాడు.

అప్పుడు రాముడు ఒక చిరునవ్వు నవ్వి " నువ్వు అన్నీ చూశావ? " అని అడిగాడు. అప్పుడా సుకుడు " ఇంకా చూడలేదు " అన్నాడు.

" విభీషణ! వీడిని తీసుకెళ్ళి దెగ్గరుండి మన సైన్యం అంతా ఒకసారి చూపించు. చూపించాక వీడిని వదిలెయ్యండి, వెళ్ళిపోతాడు " అన్నాడు.

ఆ సుకుడు వానర సైన్యం అంతా చూశాక రావణుడి దెగ్గరికి వెళ్ళాడు. అప్పుడు రావణుడు " రెక్కలు విరిగిపోయాయే " అని సుకుడిని చూసి ఎకిలించాడు.

సుకుడన్నాడు " నీలాంటి దుర్మార్గుడు కాదు రాముడు. ఆయన నన్ను ప్రాణాలతో విడిచిపెడితే వాళ్ళ సైన్యాన్ని చూసి వచ్చాను. ఆ సైన్యం సామాన్యమైన సైన్యం కాదు, అందులో అరవీర భయంకరులైన వానరులు ఉన్నారు. వాళ్ళు సముద్రాన్ని దాటి వచ్చేశారు. వాళ్ళందరూ నిన్ను మట్టుపెట్టకముందే నా మాట విని సీతమ్మని విడిచిపెట్టవయ్యా. వానరులందరినీ గరుడ వ్యూహంగా నిలుచోబెట్టారు. శిరస్థానం దెగ్గర రాముడు, లక్ష్మణుడు నిలబడ్డారు. హృదయ స్థానమునందు అంగదుడు నిలబడ్డాడు. కుడి వైపున ఋషభుడు, ఎడమ వైపున గంధమాదనుడు, వెనుక భాగమునందు సుగ్రీవుడు నిలబడ్డారు. అలా కొన్ని కోట్ల కోట్ల వానరాలని నిలబెట్టారు " అన్నాడు. 

తరువాత రావణుడు సుక, సారణులు అనే మరో ఇద్దరు గూఢచారులని పిలిచి వానర సైన్యాన్ని చూసి, ఎంత సైన్యం ఉందో లెక్కపెట్టి రమ్మన్నాడు. ఆ ఇద్దరు గూఢచారులు ప్రచ్ఛన్న రూపాలలో ఆకాశంలో ఉండి వానర సైన్యం ఎంత ఉందో అని చూస్తుండగా విభీషణుడు వాళ్ళని పసిగట్టి రాముడి దెగ్గరికి తీసుకెళ్ళి " వీళ్ళు దుర్మార్గులు, అందుకని వీళ్ళని బంధించి తీసుకొచ్చాను " అన్నాడు. ఇంతకముందు సుకుడితో ఎలా మాట్లాడాడో అలానే ఈ ఇద్దరు గూఢచారులతో రాముడు మాట్లాడి, విభీషణుడితో వాళ్ళని పంపించి సైన్యాన్ని చూడమన్నాడు.

ఆ సుక సారణులు వానర సైన్యాన్ని చూసి, రావణుడికి ఆ సైన్యం గురించి వివరించారు. అప్పుడు రావణుడు " వాళ్ళందరూ 100 యోజనాల సముద్రాన్ని దాటి వచ్చేశారు అంటున్నారు కదా, వాళ్ళని ఒకసారి నాకు చూపించండి " అన్నాడు.

అప్పుడు రావణుడు సుక సారణులతో కలిసి ఒక ప్రాసాదం ఎక్కి " వాళ్ళలో ఎవరు ఎవరో నాకు చెప్పు " అన్నాడు.

అప్పుడు సారణుడు అన్నాడు " రావణ! అక్కడ చూడు, అక్కడున్నాడే ఆయన ధూమ్రుడు. ఆ ధూమ్రుడి తమ్ముడే జాంబవంతుడు. ఆయన అపారమైన పరాక్రమము ఉన్నవాడు, కొన్ని కోట్ల వానరములతో యుద్ధానికి వచ్చాడు. వాడు గట్టిగా పెద్ద పెద్ద కేకలు వేస్తే వాడి నోట్లోనుంచి వచ్చే నాదానికి శత్రువుల గుండెలు బద్దలయిపోతాయి. వాళ్ళకి వేరె ఆయుధములు అక్కరలేదు, వాళ్ళకి గోళ్ళు, కోరలు ఆయుధములు. పళ్ళతో కొరుకుతారు, మోచేతులతో పొడుస్తారు, చెట్లు పెకలిస్తారు, పర్వత శిఖరాలని ఊపుతారు, పెద్ద పెద్ద శిలలని విసురుతారు. ఒక్కొక్కడిది 10 ఏనుగుల బలం, కొంతమందిది 100 ఏనుగుల బలం, 1000 ఏనుగుల బలం, లక్ష ఏనుగుల బలం, కొంతమందిది ఎంత బలమో చెప్పడం కుదరదు. ఇందులో ఇంకా ఆశ్చర్యమైనవాడు ఇంకోడు ఉన్నాడు, ఆయన అడుగు తీసి అడుగు వేస్తే యోజనం దూరం పడుతుంది అడుగు. ఆయనంత విశాలమైన శరీరం ఉన్నవాడు ఈ భూమిలో లేడు. అదిగో ఎదురుగా కనపడుతున్నది ఆయనే. ఆయన పేరు పనసుడు, 4 యోజనముల విశాలమైన శరీరాన్ని పొంది ఉంటాడు. అదిగో ఆయన పక్కన కనపడుతున్నవాడు సుగ్రీవుడు. 36 కోట్ల వానరములు సర్వకాలములయందు ఆయన చుట్టూ ఉంటాయి. గద ఎత్తి ' రారా రావణ ' అని ఆయన అక్కడ అరుస్తుంటే ఇక్కడ లంకలో ప్రాసాదములు కదులుతున్నాయి. ఇన్ని కోట్ల వానరాలకు ఆయన అధినాదుడు, ఆయన ఆజ్ఞకి తిరుగులేదు. ఆయన కిష్కిందని రాజధానిగా చేసుకొని పరిపాలిస్తాడు. ఈయన కన్నా బలవంతుడైన ఈయన అన్న వాలిని రాముడు ఒక్క బాణంతో కొట్టి చంపేశాడు. వాలి మెడలో ఉండే మహేంద్ర మాల ఇప్పుడు సుగ్రీవుడి మెడలో ఉంది.

అదిగో అటు చూడు, ఆయన కేసరి, హనుమ యొక్క తండ్రి. ఆయన మేరు పర్వత శిఖరాల మీద తిరుగుతుంటాడు, కొన్ని లక్షల సైన్యంతో యుద్ధానికి వచ్చాడు. ఆయనది సామాన్యమైన శక్తి కాదు. ఆ పక్కన ఉన్న గంధమాధనుడి శక్తి అంత ఇంత అని చెప్పడానికి కుదరదు. అక్కడున్న వానరములలో కొంతమంది బంగారు రంగులో మెరుస్తూ ఉంటారు, కొంతమంది కాటుక కొండల్లా ఉంటారు, కొంతమంది భయంకరమైన దంతాలతో ఉంటారు, కొంతమంది తోకలు పొడుగ్గా ఉంటాయి, కొంతమంది ఎర్రగా, కొంతమంది పచ్చగా ఉంటారు. అక్కడున్న గుహల నిండా, పర్వతాల నిండా వాళ్ళే, సముద్రం మీద వాళ్ళే, ఆ వారధి మీద వాళ్ళే, లంకా పట్టణం చుట్టూ వానరాలే. ఈ వానరాలే కాకుండా ఇంకా వానరాలు వస్తూనే ఉన్నాయి వారధి దాటుతూ. లంకా పట్టణం చుట్టూ ఉన్న వనాలలొ ఉన్న ప్రతి చెట్టు మీద భల్లూకాలు ఉన్నాయి, ఈ భల్లూకాలన్నిటికి జాంబవంతుడు నాయకుడు. ఇంకా గవయుడు, గయుడు, గవాక్షుడు కోటి ఏనుగుల బలం ఉన్నవారు. నీ మీదకి ఇవ్వాళ ఎంత సైన్యం యుద్ధానికి వచ్చిందో చెబుతాను విను, పది పదివేలయితే ఒక లక్ష, పది లక్షలయితే పదిలక్షలు, పది పదిలక్షలు అయితే ఒక కోటి, లక్ష కోట్లయితే ఒక సంకువు, వెయ్యి సంకువులు ఒక మహా సంకువు, వెయ్యి మహా సంకువులు ఒక వృందము, వెయ్యి వృందములు ఒక మహా వృందము, వెయ్యి మహా వృందములు ఒక పద్మము, వెయ్యి పద్మములు ఒక మహా పద్మము, వెయ్యి మహా పద్మములు ఒక ఖర్వము, వెయ్యి ఖర్వములు ఒక మహా ఖర్వము, వెయ్యి మహా ఖర్వములు ఒక సముద్రము, వెయ్యి సముద్రములు ఒక ఓధము, వెయ్యి ఓధములు ఒక మహా ఓధము. ఇటువంటి మహా ఓధములు ఎన్నున్నాయో చెప్పడం కుదరదు.

అదుగో అక్కడ మధ్యలో నిలబడినవాడు హనుమ, ఆయన బంగారు శరీరంతో మెరిసిపోతుంటాడు. ఆయనకి బ్రహ్మగారి వరం ఉంది, ఏ అస్త్ర-శస్త్రములకి ఆయన కట్టుబడదు. ఆయన పక్కన నీలమైన శరీరంతో, పద్మాలవంటి కన్నులతో, ఎడమ చేతితో కోదండం పట్టుకుని, సాముద్రిక శాస్త్రంలో ఎలా ఉండాలని చెప్పబడిందో అలా పోతపోసిన సౌందర్యంతో ఉన్నాడే, ఆయనే రాముడు. ఆయన పరమ ధర్మాత్ముడు, పితృవాక్య పరిపాలకుడు. ఆ రాముడి బహి ప్రాణం లక్ష్మణుడు, కంటిని కనురెప్ప కాపాడినట్టు ఆయన నిరంతరం అన్నని కాపాడుతూ ఉంటాడు. రామతుల్యమైన పరాక్రమము ఉన్నవాడు. రాముడికి ఎన్ని అస్త్ర-శస్త్రములు తెలుసో లక్ష్మణుడికి కూడా అన్ని అస్త్ర-శస్త్రములు తెలుసు " అని పొంగిపోతూ ఆ రామ సైన్యం గురించి రావణుడికి చెబుతున్నాడు.

అప్పుడు రావణుడు ఆ సారణుడిని ఆపి " నీకు ఎంత సంతోషంగా ఉందిరా వాళ్ళ గురించి చెప్పడం అంటె. నా అన్నం తిని వాళ్ళని పొగుడుతావ. ఇంకొకళ్ళు అయితే ఇప్పుడే పీకలు తీయించేవాడిని, కాని మీరు నాకు గతంలో చాలా ఉపకారాలు చేశారు కనుక వదిలేస్తున్నాను. ఇంకెప్పుడన్నా మీ ముఖాలు నాకు కనపడితే మీ పీకలు ఎగిరిపోతాయి, పోండి ఇక్కడినుంచి " అని, మళ్ళి శార్దూలుడిని పిలిచి " ఈ సారి నువ్వు వెళ్ళి గూఢచర్యం చేసి, ఎవడు ఏ వంశానికి చెందినవాడు, ఎవడు ఎవడి పుత్రుడు, రాముడు ఆహారం ఎక్కడ తింటాడు, ఎక్కడ పడుకుంటాడు, పక్కన ఎవరుంటారు, ఎవరు రక్షిస్తూ ఉంటారు మొదలైన ఈ విషయాలని కనిపెట్టి రా " అన్నాడు. 

తరువాత రావణుడు విద్యుజిహ్వుడిని పిలిచి " నువ్వు నాకు ఒక ఉపకారం చెయ్యాలి. నువ్వు గొప్ప మాయాజాలం ఉన్నవాడివి. రాముడి శరీరం నుండి శిరస్సు విడిపోతే ఆ శిరస్సు ఎలా ఉంటుందో ముమ్మూర్తులా అటువంటి శిరస్సు తయారుచెయ్యాలి. రాముడి చేతిలో ఎటువంటి కోదండం ఉంటుందో అటువంటి కోదండాన్ని సృష్టించాలి. అలాగే రాముడి బాణాలు, అక్షయతుణీరాలు ఎలా ఉంటాయో అటువంటివి సృష్టించాలి " అన్నాడు.

కొంతసేపటికి ఆయన అశోక వనానికి వెళ్ళి " సీత! నా భర్త అంత గొప్పవాడు అని గొప్పగా చెప్పావు కదా, ఆ రాముడు వానరములతో కలిసి సముద్రానికి సేతువు కట్టి దాటాడు. రాముడు దక్షిణ తీరంలో లంకకి సమీపంగా పడుకొని ఉండగా, ప్రహస్తుడి నాయకత్వంలో సైన్యం వెళ్ళి ఆదమరచి నిద్రిస్తున్న రాముడి శిరస్సుని శరీరం నుండి వేరు చేశారు. నిద్రపోతున్న వానరముల మీద మా సైన్యం దాడి చేసి అందరినీ సంహరించారు. హనుమంతుడు దవడల నుండి రక్తం కక్కుతూ చనిపోయాడు. రాముడి శిరస్సు వేరవడం చూసి లక్ష్మణుడు దిక్కులుపట్టి పారిపోయాడు. జాంబవంతుడు, సుషేణుడు, గంధమాదనుడు, శతబలి, అంగదుడు మొదలైన వీరులందరూ మరణించారు. మిగిలిన వానరాలని సముద్రంలోకి తోసేసారు. లక్ష్మణుడు మాత్రం కొంతమంది వానరములతో కలిసి పారిపోయాడు. ఇదుగో నీ భర్త శిరస్సు చూసుకుని సంతోషించు " అని చెప్పాక, అక్కడున్న ఒక రాక్షస స్త్రీని పిలిచి " రాత్రి ప్రహస్తుడు రాముడి శిరస్సుని వేరు చేసి తీసుకొచ్చాడు. విద్యుజిహ్వుడిని ఆ శిరస్సు తీసుకురమ్మన్నానని చెప్పండి " అన్నాడు.

అప్పుడు విద్యుజిహ్వుడు తీసుకొచ్చిన రామ శిరస్సుని, బాణాలని, కోదండాన్ని అక్కడ పెట్టారు. వాటిని చూడగానే సీతమ్మ నేల మీద పది మూర్చపోయింది. అప్పుడు రావణుడు ఆ కోదండాన్ని, బాణాలని సీతమ్మ దెగ్గరికి విసిరేసి " సీత! ఇప్పటికైనా నువ్వు నా పాన్పు చేరుతావ " అన్నాడు.

అప్పుడు సీతమ్మ ఆ శిరస్సుని పట్టుకొని రాముడిదో కాదో అని అవలోకనం చేసి చూసింది. అది యధాతధంగా రాముడి శిరస్సులా ఉంది. అప్పుడు సీతమ్మ అనింది " రామ! నాకు చాలా సౌభాగ్యము ఉందని, నువ్వు దీర్ఘాయిష్మంతుడవని పెద్దలు, జ్యోతిష్కులు చెప్పారు. ఇవ్వాళ ఆ జ్యోతిష్కులు చెప్పిన మాట అబద్ధమయ్యింది. నువ్వు గొప్ప యజ్ఞాగ్నితొ అంతిమ సంస్కారం జెరుపుకోవలసినవాడివి, కాని ఇవ్వాళ దిక్కులేకుండా యుద్ధ భూమిలో పడిపోయి ఉంటె క్రూరమృగాలు నీ శరీరాన్ని తినేస్తు ఉంటుంటాయి. భార్యయందు దోషం ఉంటె, భార్య ప్రవర్తనయందు విశేషమైన వైక్లవ్యం ఉంటె భర్త వెళ్ళిపోతాడని శాస్త్రం చెబుతుంది. నాయందు ఏ దోషముందని నాకన్నా ముందు వెళ్ళిపోయావు రామ " అని సీతమ్మ ఏడ్చింది.

సీతమ్మ అలా ఏడుస్తుంటే చిరునవ్వులు చిందిస్తున్న రావణుడిని చూసి ఆమె అనింది " ఇప్పటికైనా నా శిరస్సుని రాముడి శిరస్సుతోటి, నా కాయాన్ని రాముడి కాయంతోటి కలిపి అంచేస్టి సంస్కారం పూర్తిచెయ్యి. ఈ ఒక్క కోరిక తీర్చు " అని సీతమ్మ అనింది.

అదృష్టవశాత్తు అదే సమయంలో అక్కడికి ఒక భటుడు వచ్చి " మహారాజ! మీకోసం ప్రహస్తుడు ఎంతో ఆదుర్తాతో ఎదురుచూస్తున్నాడు. మీరు వెంటనే సభకి రావలసింది " అన్నాడు.

వెంటనే రావణుడు అక్కడినుంచి వెళ్ళిపోయాడు, రావణుడు వెళ్ళగానే ఆ శిరస్సు, ధనుర్-బాణములు అదృశ్యమయ్యాయి. ఏడుస్తున్న సీతమ్మ దెగ్గరికి విభీషణుడి భార్య అయిన సరమ వచ్చి " నువ్వు శోకించకమ్మా, నాకు అపారమైన శక్తి ఉంది. నేను ఆకాశంలో నిలబడినప్పుడు ఎవ్వరికీ కనపడను. నేను రాముడిని చూశాను, ఆయన గుండ్రమైన బాహువులతో ఆ వానర సైన్యాన్ని కాపాడుతూ ఆవలి ఒడ్డున ఉన్నాడు. అంత అప్రమత్తంగా రాముడు నిద్రపోతాడ?, రాక్షసులు రాముడిని సంహరించగలరా? ఇంద్రుడు దేవతలని రక్షిస్తున్నట్టు, రాముడు వానరములని రక్షిస్తుంటాడు. నేను ఇప్పుడే చూసి వచ్చాను ఇది విద్యుజిహ్వుడి మాయ. అందుకనే రావణుడు వెళ్ళగానే ఇక్కడున్న శిరస్సు అంతర్దానమయ్యిపోయింది. రావణుడి మాయలు నమ్మకు, ఉపశాంతిని పొందు " అనింది.

" నువ్వు చెప్పినది నిజమైతే రావణుడు ఇప్పుడు ఏమి చేస్తున్నాడో చూసి, నాకు చెప్పు " అని సీతమ్మ సరమతో అనింది.

అప్పుడు సరమ రావణుడి అంతఃపురానికి వెళ్ళి, కొంతసేపటికి తిరిగొచ్చి " ఇప్పుడే నేను విని వచ్చాను, రావణుడి తల్లి కైకసి, ఒక వృద్ధుడైన మంత్రి రావణుడికి నచ్చచెప్పారు. ' ఏది ఏమైనా సీతని విడిచిపెట్టడం జెరగదు ' అని రావణుడు అన్నాడు. రాముడితో యుద్ధం చెయ్యడానికి కారణం చెప్పకుండా సైన్యాన్ని పిలవమన్నాడు. రాక్షసుల కోలాహలం గట్టిగా వినపడుతోంది. మేరు పర్వత శిఖరాల చుట్టూ తన గుర్రముల మీద ఎక్కి తిరిగే సూర్యనారాయణమూర్తిని ఉపాసన చెయ్యి, నీకు సమస్త శుభములు కలుగుతాయి " అని చెప్పింది.

సరమ మాటలకి సీతమ్మ ఉపశాంతిని పొందింది.

ఈలోగా మాల్యవంతుడు(తాత వరస) రావణుడి దెగ్గరికి వచ్చి " సృష్టిలో ధర్మం ఎప్పుడూ కూడా దేవతల వైపు ఉంటుంది, అధర్మం అసురుల వైపు ఉంటుంది. అధర్మపక్షం ధర్మపక్షం చేత ఓడింపబడుతుంది. నువ్వు సీతమ్మని అపహరించి తెచ్చినప్పటినుంచి దుర్నిమిత్తములు కనపడుతున్నాయి, అందుకని మనం ఓడిపోక తప్పదు. నువ్వు సీతమ్మని తెచ్చినప్పటినుంచి, తెల్లటి రెక్కలు ఉండి ఎర్రటి పాదాలతో ఉండే పావురాలు అరుస్తూ గోల చేస్తున్నాయి, ఇంట్లో పెంచుకునే చిలకలు, గోరింకలు మంచి మాటలు చెప్పడం మానేసి వీచి-కూచి మాటలు చెబుతున్నాయి, ఎక్కడినుంచో క్రూరమైన పక్షులు వచ్చి వీటితో యుద్ధం చేస్తున్నాయి, ఏ ఇంటిముందు చూసినా నల్లనివాడు, బోడిగుండువాడు, ఎర్రటి వస్త్రములు కట్టుకున్నవాడు ఉదయము సాయంకాలము ఇళ్ళల్లోకి తొంగిచూస్తున్నట్టు కనపడుతోంది. వచ్చినవాడు సామాన్యుడు కాదు, శ్రీ మహావిష్ణువు వచ్చాడు, సీతమ్మని రాముడికి అప్పగించి సంధి చేసుకుని బతికిపో, నా మాట విని యుద్ధం చెయ్యకు " అన్నాడు.

అప్పుడు రావణుడు " చేతిలో పద్మములేని లక్ష్మీదేవి ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉన్న సీతని నేను వదులుతాన, రాముడు గొప్పవాడే కావచ్చు కాని నేను కూడా సురాసురులని ఓడించాను. అందరూ నాకు నీతులు చెబుతున్నారు కాని నన్ను ప్రోత్సహించే వాడు కనపడడం లేదు. మీరందరూ బుద్ధిహీనులు. తాత! నువ్వే కాదు, ఒకవేళ బాణం పెట్టి నా శరీరాన్ని రెండుగా చీల్చినా, కత్తి పెట్టి నా శరీరాన్ని రెండుగా నరికేసినా ఆ రెండు ముక్కలు మాత్రం ముందుకి వంగవు, వెనక్కే పడిపోతాయి. ఒకరిమాట వినడం నాకు చేతకాదు, ఇది నా స్వభావం " అని చెప్పాడు.

అటుపక్క రాముడు లంకా పట్టణాన్ని చూద్దామని సువేల పర్వత ఎక్కాడు. అప్పుడే ఎదురుగా ఉన్న అంతఃపురంలోకి రావణుడు విశేషమైన మాలలు, వస్త్రాలు వేసుకుని బయటకి వచ్చాడు. అలా వస్తున్న రావణుడిని చూసిన సుగ్రీవుడు ఆగ్రహించి ఒక్క దూకు దూకి రావణుడి మీద పడ్డాడు. ఇద్దరూ పోడుచుకున్నారు, కొట్టుకున్నారు, రక్తాలు కారేటట్టు గుద్దుకున్నారు. ఇంతలో రావణుడు మాయలు ప్రదర్శించడం మొదలుపెట్టాడు. వీడు మాయా యుద్ధం చేస్తున్నాడని సుగ్రీవుడు ఎగిరి మళ్ళి రాముడి పక్కకి వచ్చేశాడు. అప్పుడు రాముడన్నాడు " సుగ్రీవ! ఇలా నువ్వు వెళ్ళిపోయావె, నీకు ఏదన్నా అయితే నాకు సీత ఎందుకు, లక్ష్మణుడు ఎందుకు, భరతుడు ఎందుకు, శత్రుఘ్నుడు ఎందుకు. నేను మనస్సులో ఎమనుకున్నానో తెలుసా, ఒకవేళ రావణుడి చేతిలో నీకు జెరగరానిది జెరిగితే, ఈ రావణుడిని ఇక్కడే చంపేసి, విభీషణుడికి పట్టాభిషేకం చేసేసి, లక్ష్మణుడిని వెనక్కి పంపి భరతుడిని రాజ్యం ఏలుకోమని చెప్పి, నేను కూడా శరీరాన్ని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోదామనుకున్నాను. నువ్వు లేకుండా నేను ఒక్కడినీ మాత్రం వెనెక్కి వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాను. ఇంకెప్పుడూ ఇలాంటి సాహసాలు చెయ్యకు " అన్నాడు.

తరువాత అంగదుడిని పిలిచి రావణుడి దెగ్గరికి రాయబారానికి పంపారు. రాముడు అంగదుడితో  " నువ్వు ఎందరో మహర్షులని బాధలు పెట్టావు, ఎందరో స్త్రీలని అపహరించావు. నువ్వు చేసిన పాపాలకి దండన విధించడానికి, నా భార్యని కూడా అపహరించావు కనుక నీయందు దోషమున్నది కనుక, నిన్ను నేను సంహరించవచ్చు కనుక, ఇవ్వాళ లంకా పట్టణానికి వచ్చాను. ఏ దేవర్షులని, రాజులని నిష్కారణంగా వధించి పంపించావో ఆ మార్గంలోనే నిన్ను పంపిస్తాను. అంతఃపురం విడిచి బయటకి రా " అని రాముడు అంగదుడితొ చెప్పాడు.

అంగదుడు వెంటనే వెళ్ళి రావణుడితొ ఈ మాటలు చెప్పాడు. ఆ మాటలు విన్న రావణుడు ఆగ్రహించి తన సైనికులతో అంగదుడిని పట్టుకోమని చెప్పాడు. ఆ సైనికులు అంగదుడిని పట్టుకోగా, అంగదుడు ఆ సైనికులతో సహా పైకి ఎగిరి ఒళ్ళు దులుపుకున్నాడు, అప్పుడా సైనికులందరూ కింద పడిపోయారు. అంగదుడు వెళ్ళిపోతూ రావణుడి అంతఃపుర ప్రాసాదాన్ని ఒక్క తన్ను తన్నాడు, ఆ దెబ్బకి ఆ ప్రాసాదం ఊడి కదిలిపోయింది.

రావణుడు వెంటనే ద్వారాలన్నీ మూయించేసాడు. యుద్ధం ప్రారంభం అవుతుంది అందరూ సిద్ధంకండి అన్నాడు. తూర్పు దిక్కుకి సర్వసైన్యదికారి అయిన ప్రహస్తుడిని మోహరించాడు, దక్షిణ దిక్కుకి మహోదర, మహోపార్షులని నియమించాడు, పశ్చిన దిక్కుకి ఇంద్రజిత్ ని పెట్టాడు, ఉత్తర దిక్కుకి సుక సారణులని పెట్టి, నేను మీతో యుద్ధానికి వస్తాను అన్నాడు. ఇదంతా చూసిన విభీషణుడి గూఢచారులు విషయాన్ని వెనక్కి వెళ్ళి చెప్పారు.

అప్పుడు రాముడు " తూర్పు దిక్కున ఉన్న ప్రహస్తుడిని మన సర్వసైన్యాధికారి అయిన నీలుడు ఎదుర్కొంటాడు. దక్షిణ దిక్కున ఉన్న మహోదర, మహోపార్షులని యువరాజైన అంగదుడు ఎదుర్కొంటాడు. పశ్చిమ దిక్కున ఉన్న ఇంద్రజిత్ ని హనుమంతుడు ఎదుర్కొంటాడు. ఉత్తర దిక్కున ఉన్న సుక సారణులకి నాయకత్వం వహించి రావణుడు ఉన్నాడు కనుక లక్ష్మణుడితో కలిసి నేనే వెళ్ళి ఎదుర్కొంటాను. నాలుగు దిక్కులా యుద్ధం ప్రారంభం అవుతోంది, బయలుదేరండి " అన్నాడు.

2 కామెంట్‌లు:

  1. సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చ యాచతే
    అభయం సర్వ భూతేభ్యో దదామ్యేతద్ వ్రతం మమ

    Witnessing dharma and adharma war prepatations here. Anyway the powers, planing of Sri Rama were at greatest levels. He received lot of resources from Gods. In this kali yuga, it is very difficult to find a single person to support towards dharma cent percent. May be we all are struggling for relative dharma - a diluted version. Why? Corruptions and evils spread like wild fire everywhere. Bad politics too running everywhere. Sticking to just dharma is tough and tough and tough!!! May be Vishnu should come as Sri RAMA(of course without any such bad/painful incidents of Threta yuga) again or take another avatar so that ethical persons live happily, peacefully from birth to death and to pass the values to next generations. Otherwise who will protect the noble souls unconditionally! Firt thing is to do is that we all should work towards Sri Rama Rajjam.

    Sri Rama Jaya Rama Jaya Jaya Rama
    Jai Sri Rama Jai Sri Rama Rajjam.

    రిప్లయితొలగించండి